రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జగిత్యాల: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఈనెల 29న శనివారం జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించు కోనున్నారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ టూర్ కు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. శనివారం ఉదయం 7గంటలకు హైదారాబాద్లోని మాదాపూర్ నివాసం నుంచి కొండగట్టుకు రోడ్డు మార్గం గుండా పవన్ కళ్యాణ్ రానున్నారు. పవన్ అభిమానులు, కార్యాకర్తలు పోలీస్ కు సహరించాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో జనసేన బలోపేతంపై పవన్ ఫోకస్ పెడతారని తెలంగాణ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు సాగర్ తెలిపారు. ప్రజా సమస్యలపై జనసేన తరుపున పోరాటం చేస్తాం అని,సిరిసిల్ల చేనేత కార్మిక సమస్యలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతారని, జనసేన లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని, ఏపీలో జనసేన విజయం తెలంగాణ రాష్ట్రంలో ప్రభావం చూపుతోందని సాగర్ వెల్లడించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు జనసేనలో చేరేందుకు ఉత్సాహంతో ఉన్నారని సాగర్ అన్నారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ ను కోరుతాం వెల్లడించారు. జనసేనలో పనిచేయటానికి యువతరం అత్యంత ఉత్సాహంతో ఉన్నారని తెలంగాణ జనసేన నేత సాగర్ పేర్కొన్నారు.






