పేదబాలికకు క్యాన్సర్ చికిత్స అందించాలని ఏపీ మంత్రి విజ్ఞప్తి
- చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకున్న నందమూరి బాలకృష్ణ
- ఏపీ ప్రభుత్వం తరపున ప్రత్యేక ఆర్థిక సహాయం
బంజారాహిల్స్, జూలై 26 (విజయక్రాం తి): బసవతారకం ఇం డో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్స్ చైర్మన్ నం దమూరి బాలకృష్ణ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. హాస్పిటల్లో పేదబాలికకు క్యాన్సర్ చికిత్సను అందిస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే ఏపీలో ఉన్న అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువుకు చెందిన ఆంజనేయులు, విజయమ్మ దంపతుల కుమార్తె సాసాని చంద్రిక (6) కంటి కింది భాగంలో క్యాన్సర్ గడ్డతో బాధపడుతోంది.ఆంజనేయులు కాలం చేయడం, పేద కుటుంబం కావడంతో విజయమ్మ కుమార్తెను కాపాడుకోవడానికి మీడియా ద్వారా సహాయాన్ని కోరింది.విషయం తెలుసుకున్న ఉపముఖ్యమంత్రి పవణ్ కళ్యాణ్ ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ కు సమాచారం ఇచ్చారు.
దీంతో సత్యకుమార్ చొరవ తీసుకొని నందమూరి బాలకృష్ణను ఇటీవల సంప్రదించి చికిత్స అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. మంత్రి వినతిపై సానుకూలంగా స్పందించిన ఆయన బాలిక చికిత్సకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ వైద్యులను ఆదేశించారు.అయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని బాలిక చికిత్స నిమిత్తం అందిస్తోంది.బాలికకు ఆదివారం నుంచి చికిత్స ప్రారంభం అయిన నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ బసవతారకం ఆసుపత్రిని సందర్శించారు.బాలికతో పాటు తల్లి విజయమ్మను పరామర్శించి వారి మంచిచెడులను తెలుసుకున్నారు.అనంతరం హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రావి శ్రీనివాసరావుతో మాట్లాడి చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లపై సమాచారం తెలుసుకొని పలు సూచనలను చేశారు.మంత్రి వెంట హాస్పిటల్ అధికారులు,వైద్యులు తదితరులున్నారు.






