07-07-2025 12:00:00 AM
ఆకాశాన ఆరేసిన మేఘాల దుప్పట్లు
ఉరుములు మెరుపుల హెచ్చరికల నాదాలు
చిటపట చినుకుల తొలకరి తుళ్లింతలు
తానమాడిన మట్టి తన్మయత్వపు దృశ్యాలు
ఆరుద్ర పురుగుల అపురూప పరుగులు
తాకిన క్షణమే సిగ్గుతో ముడుచుకునే తీరులు
అరచేతిలో భయంతో నిశ్చల రీతులు
చెరసాలనే వదిలి ఉసిళ్ల ఉరుకులు
దీపం చుట్టూ ఆత్మార్పణ ప్రదక్షిణలు
అగ్గిపెట్టెల్లో దూరిన బంగారు పురుగులు
అపురూప ఆస్తులంటూ పిల్లల మురిపాలు !
ఏరువాక నాగేటి సాళ్ల నేల తల్లి గర్భాన..
తడిమట్టితో విత్తు వియ్యమంది వికసించ..
భూమాత దేహమంతా కప్పిన హరిత చీరలు
రైతు మదిలో శ్రీమంతాల శుభకార్యాలు
నిండు గర్భిణివోలె గుమ్ముల్లో ధాన్యాలు
అన్నామృత వర్షమే కురిసిన శుభవేళలు
దిగులును తరిమే అపురూప దిగుబడులు
ఫలసాయంతో లోక కళ్యాణ ఉత్సవాలు
సాగుబడిలో బాగుపడిన సంతోషాలు
స్వర్ణభారతి కంఠాన సంపదల సరాగాలు
ఊరు ఊరంతా ఉత్సవ తోరణాల శోభలు !