ఉపాధ్యాయులను నియమించండి..
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): కేరమేరి మండలంలోని ఇందాపూర్ ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. పాఠశాలలో 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు విద్యార్థులు చదువుతుండగా, బోధనకు కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు.
దీంతో ఒకే ఉపాధ్యాయుడు ఒకేసారి పలు తరగతులను నిర్వహించాల్సి వస్తోందని, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందక చదువులో వెనుకబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఇందాపూర్ గ్రామంలో ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో చిన్నారులకు పోషకాహారం, ప్రాథమిక విద్య అందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
గ్రామంలో కనీస మౌలిక వసతులు కూడా పూర్తిస్థాయిలో లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఇందాపూర్ గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో సమస్యలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.






