యూరియా కోసం రైతు కన్నీరు!
అటెండర్ కాళ్లపై పడి రెండు బస్తాలు ఇప్పించాలని వేడుకోలు..
కొల్చారం, ఆగస్టు 12 (విజయక్రాంతి): యూరియా కోసం వచ్చిన ఓ రైతు ఆవేదన రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సొసైటీ) వద్ద ఉన్న రైతులను కలచివేసింది. చిలిపిచేడు మండలం చిట్కుల గ్రామానికి చెందిన ఓ రైతు యూరియా కొనుగోలు చేసేందుకు రంగంపేట సొసైటీకి వచ్చాడు. అయితే మొబైల్ ఫోన్ ద్వారా పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అవగాహన లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.
నాకు ఇద్దరు ఆడపిల్లలే.. తోడెవరూ లేరు
యూరియా తీసుకునే విధానం తనకు తెలియకపోవడంతో ఆ రైతు భావోద్వేగానికి గురయ్యాడు. “నాకు ఇద్దరు ఆడపిల్లలు మాత్రమే ఉన్నారు. నాకు ఎవరూ తోడులేరు. నా దగ్గర చిన్న ఫోన్ మాత్రమే ఉంది. యూరియా సంచులు తీసుకోవాలంటే ఈ కొత్త విధానాలు నాకు తెలియడం లేదు. ఎవరైనా సాయం చేయాలి” అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
అటెండర్ కాళ్లపై పడి వేడుకోలు
రైతు ఆవేదన మరింత కలిచివేసేలా మారింది. సహకార సంఘం అటెండర్ బిక్షపతి కాళ్లపై పడిన రైతు.. ఒక్కో బస్తా రూ.900 చొప్పున రెండు బస్తాల యూరియా ఇప్పించాలని వేడుకున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు రైతులు తీవ్రంగా చలించిపోయారు.
స్మార్ట్ ఫోన్ లేని రైతుల పరిస్థితి ఏంటి?
ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ విధానాలపై అవగాహన లేని, స్మార్ట్ఫోన్ సదు పాయం లేని రైతులు ఎరువులు పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని తోటి రైతులు పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేని రైతులకు యూరియా అందేలా సొసైటీల వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. డిజిటల్ ప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సమయంలో రైతులకు ప్రత్యక్షంగా సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.






