12 August, 2026 | 8:37 PM

బోధన్ 100 స్తంభాల గుడికి ఫెన్సింగ్, వాచ్‌మెన్ నియామకం!

12-08-2026 07:25 PM

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని చారిత్రక ప్రసిద్ధి గాంచిన 100 స్తంభాల ఆలయాన్ని తెలంగాణ పురావస్తు శాఖ అధికారులు బుధవారం పరిశీలించారు. శిథిలావస్థకు చేరుతున్న ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించిన అధికారులు ఆలయ పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ఆలయ రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, భద్రత కోసం వాచ్‌మెన్‌ను నియమిస్తామని పురావస్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు.

ఆలయ పరిసరాల్లో ఆక్రమణలు జరిగాయా అనే విషయాన్ని గుర్తించేందుకు సమగ్ర సర్వే నిర్వహించాలని స్థానికులు అధికారులను కోరారు. ఆలయానికి సంబంధించిన ఎకరం పది గుంటల భూమిని పూర్తిగా గుర్తించి, భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలకు తావులేకుండా పరిరక్షించాలని యోగ్ ధారణ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఉదయ్ మహారాజ్, అడ్వకేట్ సాయి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ ధర్మతో పాటు స్థానికులు పురావస్తు శాఖ అధికారులను కోరారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఆలయాన్ని సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు బోధన్ చారిత్రక వారసత్వాన్ని అందించవచ్చని వారు పేర్కొన్నారు.

ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచడంతో పాటు అవసరమైన మరమ్మతులు చేపట్టి, సందర్శకులకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని కోరారు. పురావస్తు శాఖ అధికారులు ఆలయ పరిస్థితులను పరిశీలించి, సంబంధిత అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిబంధనల ప్రకారం చర్యలు చేపడతామని తెలిపారు. ఆలయానికి ఫెన్సింగ్, వాచ్‌మెన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.