28 March, 2026 | 2:09 AM

అసంపూర్తి రోడ్డు..!

28-03-2026 12:11 AM

అటూ ఇటూ పూర్తి..

మద్యలో ఇబ్బంది..

కేసముద్రం, మార్చి 27 (విజయక్రాంతి): కేసముద్రం నుండి వెంకటగిరి మీదుగా ఇంటికన్నె రైల్వే స్టేషన్ రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల తారు రోడ్డు వేశారు. సుమారు ఏడు కిలో మీటర్ల వరకు తారు రోడ్డు పనులు చేపట్టగా గత ఏడాది కాంట్రాక్టర్ తారు రోడ్డు పనులు పూర్తి చేశారు. అయితే ఇంటికన్నె, వెంకటగిరి గ్రామాల్లో విలేజ్ పోర్షన్ రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదు. కేసముద్రం ఆర్టీసీ బస్టాండ్ నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులు నిర్వహించి, ఈ రెండు గ్రామాల్లో పనులు చేపట్టకుండా వదిలేశారు.

దీనితో కేసముద్రం నుండి ఇంటికన్నె రైల్వే స్టేషన్ వరకు తారు రోడ్డు వేసినప్పటికీ ఇంటికన్నె, వెంకటగిరి గ్రామాల్లో రోడ్డు పనులు చేపట్టకపోవడం వల్ల వాహనాల రాకపోకలకు యధావిధిగా ఇబ్బంది కలుగుతోంది. ఆయా గ్రామాల్లో ఎదురెదురుగా రెండు వాహనాలు వస్తే పక్కకు తప్పుకోవడానికి ఇరుకైన రోడ్డు ఇబ్బంది పెడుతోంది. ఈ రెండు గ్రామాల్లో సుమారు 700 మీటర్ల చొప్పున రోడ్డు విస్తరణ చేపట్టి, మెరుగైన రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది.

అయితే కాంట్రాక్టర్ కు ఇప్పటివరకు పూర్తి చేసిన రోడ్డు పనులకు సంబంధించి బిల్లు చెల్లించకపోవడం వల్ల, గ్రామాల్లో మిగిలిపోయిన రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదని ప్రచారం సాగుతోంది. రెండు గ్రామాలకు ఇరువైపులా మెరుగైన డబుల్ రోడ్డు ఉండగా గ్రామాల్లోకి చేరుకోగానే రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడం వల్ల వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల కేసముద్రం నుండి నెక్కొండ వరకు వెళ్లే వాహనదారులకు ఆటంకంగా మారింది. ఆర్ అండ్ బి అధికారులు స్పందించి ఇంటికన్నె, వెంకటగిరి గ్రామాల్లో మిగిలిపోయిన విలేజ్ పోర్షన్ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. అలాగే వెంకటగిరి చెరువు మత్తడి వద్ద దెబ్బతిన్న రోడ్డు పనులను చేపట్టి, హై లెవెల్ వంతెన నిర్మించి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరుతున్నారు.