మేం పనికిరామా?
- సమాచార లేమితో స్థితి మారని బతుకులు
అడ్డా కూలీలకు అందని ద్రాక్షగా పథకాలు
కామారెడ్డి, జూన్ ౫ (విజయక్రాంతి) : ఎన్నో ఏళ్లుగా శ్రమ పడుతున్నా తమ స్థితిగతులు మారడం లేని కామారెడ్డి అడ్డా మీది కూలీలు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వాలు, పాలకులు మారినా తమ జీవితాలు మెరుగుపడడం లేదని దిగులు పడుతున్నారు. కామారెడ్డి పట్టణంతో పాటు ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, పిట్లం ప్రాంతాలకు చుట్టుపక్కల గ్రామాలకు నిత్యం వందలాది మంది కూలి పనుల కోసం వస్తుంటారు. ఆయా ప్రాంతా ల్లో ఒక అడ్డా ఏర్పాటు చేసుకుని పనులు ఇచ్చే వారి కోసం ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి మధ్యాహ్నం వరకు వేచిచూసినా పనులు దొరకని పరిస్థితి ఎదురుతుంటుంది. పనులు దొరికిన రోజు సంతోషంగా, లేని రోజు నిరుత్సాహంగా ప్రయాణ ఖర్చులు పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్లాల్సిందే. ఇలా కామారెడ్డి పరిధిలో 1.50 లక్షలకు పైగా కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ‘ఈ శ్రమ్’ పోర్టల్‌లో నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరే కాకుండా మరో లక్షన్నర వరకు కూలీలు ఉంటారని అంచనా వేస్తున్నారు.
కూలీలంటే చిన్నచూపే..!
ప్రతి ఒక్కరికీ కూలీలతో అవసరం పడుతుంది. ఆర్థికంగా ఉన్నవారికి కూలీలు లేనిదే ఇల్లు గడవదు. కానీ, అలాంటి కూలీలంటే ఇప్పటికీ చిన్నచూపు కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాలు కూడా వారిని విస్మరిస్తూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు గుప్పించి.. ముఖం చాటేయడం తప్ప వారిని పట్టించుకునేవారు లేరు. అధికారులు సైతం దినసరి కూలీల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ప్రభుత్వం వారికి అందించే సంక్షేమ పథకాలు ఏవైనా ఉంటే కూలీలకు సమాచారం ఇవ్వడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారు.
దీంతో కూలీలు కొన్ని పథకాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా కూలీలు నిత్యం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణిస్తుంటారు. ప్రమాదకర పరిస్థితుల మధ్య పనులు చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు ఏదైనా జరిగితే.. ఇంటిల్లిపాది వీధిన పడాల్సినట్టే. ఈ సందర్భంగా వారి కుటుంబానికి అండగా ఉండేలా సర్కారు బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదొక్కటే.. మరికొన్ని స్కీములు అసంఘటితరంగ కార్మికులకు అమలవుతున్నాయి. వాటి గురించి అవగాహన కల్పించే వారు కరువయ్యారు.
కార్మికులకు అవగాహన కల్పించి బీమా చేయిస్తున్నాం
ఆ సంఘటిత కార్మికులకు కార్మిక సంఘాలతో పాటు కార్మిక శాఖ అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నాం. ఈ పేర్లు నమోదు చేసుకోవాలని సూచిస్తున్నాం.ఈ శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకొని భీమా చెల్లిస్తే 6 లక్షల భీమా సౌకర్యం ఉంటుంది. అంతే కాకుండా కార్మికునికి ఆడ పిల్లలు ఉంటే పెండ్లి ఖర్ఛులకు రూ. 30 వేల చొప్పున చెల్లించడం జరుగుతుంది. కార్మికుడు మృతి చెందితే అంత్యక్రి యల ఖర్చులు కూడా చెల్లిస్తుంది. కార్మికులు అవగాహన లేక ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను పొందడం లేదు. పనులు చేసేటప్పుడు ప్రమాదవశాత్తు చనిపోతే ఆరు లక్షల బీమా కుటుంబానికి అందుతుంది. అంతే కాకుండా వైద్య సౌకర్యాలు కూడా అందుతాయి. కార్మికులు నిర్లక్ష్యం చేయకుండా 18 సంవత్సరాలు పైబడిన కార్మికు లందరు కార్మిక శాఖలో పేర్లు నమోదు చేసుకొని భీమా సౌకర్యం పొందాలి.
-కోటేశ్వర్లు, సహాయ కార్మికశాఖ కమిషనర్, కామారెడ్డి






