calender_icon.png 8 June, 2025 | 12:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నీ మరచిపోతున్నారా?

01-06-2025 12:00:00 AM

మతిమరుపు కొన్ని సమయాల్లో వరం అవుతుంది. మరికొన్ని సమయాల్లో శాపమవుతుందని అంటారు. నిజానికి మనిషికి మతిమరుపు శాపమే. ఇది ఆరోగ్య సమస్య. సాధారణ మతిమరుపును మనం అల్జీమర్స్ అంటాం. డిమెన్షియా అనేది అల్జీమర్స్‌లో ఒక రకం. ఇందులో మెదడుకు ఉన్న శక్తి క్రమంగా సన్నగిల్లుతుంది. డెమెన్షియా అంటే ఒక రోగం కాదు, అనేక రోగాల సముదాయం. 

మనిషి మెదడు లోపల కొన్ని కణాలు దెబ్బతినడం వల్ల మనిషిలో అనేక నైపుణ్యాలు కనుమరుగైపోతాయి. ముఖ్యంగా తెలివితేటలు, నేర్చుకునే సమర్థత, ఏకాగ్రత, పరిశీలనాశక్తి వంటివి బాగా తగ్గిపోతాయి. ఎంత జ్ఞాపకశక్తి ఉన్నా సరే ఈ వ్యాధుల బారిన పడితే తరుచూ మరిచిపోతుంటారు.

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో కనబడే అల్జీమర్స్, డిమెన్షియా లక్షణాలు ఇప్పుడు యుక్తవయసులో ఉన్నవారిలో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. దీనివల్ల వ్యక్తి ఆలోచన, ప్రవర్తన, మాట, కదలికలు అన్నీ మారిపోతాయి. డిమెన్షియాకు కారణం ఏమిటి? నివారణ మార్గాలు ఏమిటి? అనే విషయాలను తెలుసుకుందాం.. 

ఏం చేయాలంటే?

వృద్ధాప్యంలో మతిమరుపును, తికమక తెచ్చిపెట్టే అల్జీమర్స్ రోజువారీ పనులను బాగా దెబ్బతీస్తుంది. ముందు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని నివారించే వీలుంది. 

ఒమెగా ఒమేగా విటమిన్ ఈ, బీ12 దండిగా లభించే అవిసెలు, వాల్‌నట్స్, పిస్తా, బాదం, జీడి పప్పు, పెరుగు, పాలు, మాంసం, చేపల వంటివి తరచుగా తీసుకోవాలి. 

వ్యాయామం వల్ల అల్జీమర్స్ ముప్పు తగ్గుతుంది. మెదడుకు రక్తం సరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాలు అభివృద్ధి చెందే ప్రక్రియ కూడా ప్రేరేపితమవుతుంది. 

వారానికి కనీసం మూడు సార్లయినా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలీఫెనాల్స్ అల్జీమర్స్‌ను నివారించే సామర్థ్యముంది. 

తగినంత నిద్రపోవాలి. దీనివల్ల శరీరానికి, మనసుకు విశ్రాంతి లభిస్తుంది. మద్యం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపాలి. 

ఎందుకు?

ఈ సమస్య కొందరికి వంశపారంపర్యంగా సంక్రమించే జన్యువులతో రావచ్చు. అందుకే కొన్ని కుటుంబాల్లో మతిమరుపు సమస్య తరతరాలుగా కనిపిస్తుంది. 

లక్షణాలేంటి?

ఇటీవల జరిగిన విషయాలను మరచిపోతుంటారు. మళ్లీ కొన్నేళ్ల క్రితం జరిగిన సంగతులు గుర్తుంటాయి. గందరగోళం ఎక్కువగా ఉంటుంది. మనుషుల్ని గుర్తు పట్టలేరు. వస్తువులు ఎక్కడ పెట్టారో మరచిపోతారు. 

డైరెక్షన్స్ గుర్తు ఉండవు. చెప్పిందే చేప్తారు. చేసిందే చేస్తారు. అడిగిందే అడుగుతారు. మార్పుకి భయపడతారు. కొత్త ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడరు. కొత్త వ్యక్తులను కలవడానికి ఇష్టపడరు.

ముందు చేయాల్సిన పనిని తరవాత చేయాల్సిన పనిని ముందు చేస్తుంటారు. తొందర పడటం, అనుచితంగా మాట్లాడటం, ఒకే పనిని పదేపదే చేయడం, అవే పదాలను మళ్లీ మళ్లీ వాడతారు. కుటుంబం మీద, అంతకు ముందు ఆనందం కలిగించిన పనుల మీద ఆసక్తి చూపించరు. 

మాట్లాడటంలో ఇబ్బంది, పదాలను అర్థం చేసుకోలేకపోవడం, చెప్పాలనుకున్న విషయానికి సంబంధించిన పదాలు గుర్తుకు రాకపోవడం. పనుల నిర్వహణలో కన్‌ఫ్యూజన్, లక్ష్యాలను చేరుకోలేక ఇబ్బంది పడటం, నడవడంలో ఇబ్బంది, నడుస్తూ ఒక్కసారిగా తూలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.