calender_icon.png 8 June, 2025 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వుదాం.. నవ్విద్దాం!

01-06-2025 12:00:00 AM

నవ్వడం ఒక యోగం.. నవ్వకపోవడం ఒక రోగం అనే సామెత ఉంటుంది. నిజానికి నవ్వు అనేది ఆరోగ్యానికి ఔషధంలా పనిచేస్తుందని నిపుణు లు చెబుతున్నారు. ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్‌లేని సహజమైన ఔషధం. ఉరుకుల పరుగుల జీవితంలో కాసింత నవ్వు ఎన్నో ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుందని ఓ పరిశోధనలో తేలింది.

రోజుకు కనీసం 15 నిమిషాల పాటు నవ్వడం వల్ల శరీరానికి రెండు గంటల నిద్ర ఇచ్చినంత ప్రయోజనం కలుగుతుంది. నవ్వడం వల్ల శరీరంలోని స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి. ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహజమైన ఔషధం. దీనివల్ల మనసు హాయిగా ఉంటుంది.

ముఖ్యంగా టైప్ డయాబెటిస్‌కు అదుపులో ఉంటుంది. నవ్వుతో రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇది గుండె జబ్బుల అవకాశాలను తగ్గిస్తుంది. అలాగే శరీరంలో యాంటీ బాడీలు పెరిగి రోగనిరోధక శక్తి బలపడుతుంది. దీనివల్ల చిన్నపాటి జ్వరం నుంచి తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యల వరకు ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. నవ్వే సమయంలో ముఖంలోని కండరాలు కదిలి రక్తప్రసరణ మెరుగవ్వడంతో పాటు చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా మెరిసిపోతుంది.

ఇదే కాకుండా నవ్వడం వల్ల శరీరంలోని ఎండార్ఫిన్స్ విడుదలై ఒత్తిడికి కారణమైన సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా మైగ్రేన్, నరాల నొప్పులకు ఇది సహజ పరిష్కారం. నవ్వే సమయంలో ఛాతి, జీర్ణాశయ భాగాలు కదిలి వ్యాయామం చేసినంత ప్రయోజనం కలుగుతుంది.

దీనివల్ల ఆ భాగాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. నిద్రలేమి సమస్యతో బాధపడే వారు నవ్వడం ద్వారా హాయిగా నిద్రపోతారు. అలసటగా ఉన్నప్పుడు కొద్ది నిమిషాలు నవ్వితే శరీర శక్తిస్థాయి తిరిగి పెరుగుతుంది. నవ్వడానికి హాస్య కథలు చదవడం, కామెడీ వీడియోలు చూడటం, స్నేహితులతో సరదా చర్చలు జరపడం వంటివి చేయాలి.