11-12-2025 01:21:12 AM
‘సర్’పైచర్చకు సిద్ధమా?
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ఓట్‌చోరీ వ్యవహారంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం ఒక్కసారిగా హీటెక్కాయి. లోక్‌సభలో రాహుల్ గాంధీ.. కేంద్ర మంత్రి అమిత్‌షా మధ్య మాటల తూటాలు పేలాయి. ఎన్నికల సంస్కరణలపై ప్రత్యేక దర్యాప్తు నివేదిక (ఎస్‌ఐ ఆర్)పై లోక్‌సభలో జరుగుతున్న చర్చ బుధవారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ అంశంపై చర్చకు రావాలని అమిత్‌షాకు లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు.
అ సవాల్‌కు అమిత్ షా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘ఓటు చోరీ’ ఆరోపణలపై అమిత్‌షా ప్రసంగాన్ని అడ్డుకున్నారు. రాహుల్ గాంధీ అకస్మాత్తుగా లేచి నిలబడి బడ్డారు. ‘చరిత్రలో తొలిసారిగా ఎన్నికల కమిషనర్‌కు పూర్తి రోగనిరోధక శక్తిని ఎందుకు ఇచ్చారో నాకు తెలియాలి. దీని వె నుక కారణం ఏమిటి? హర్యానా గురించి ఆయన ఒక్క ఉదాహరణే చెప్పారు. కానీ అక్కడ 19 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత అమిత్‌షాకు నేరుగా ఒక ‘ఓపెన్ ఛాలెంజ్‘ విసిరారు. ‘మీరు మాకు చెప్పండి.. నిజానికి, నా పత్రికా సమావేశంపై చర్చించుకుందాం.
చాలామంచి ఆలోచన. పదండి, చర్చించుకుందాం. అమిత్ షా జీ, నేను మీకు సవాలు చేస్తున్నాను, చర్చకు రండి’ అని రాహుల్ గాంధీ సభలోనే ప్రకటించారు. రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఇది ‘పూర్తిగా రక్షణాత్మక ప్రతిస్పందన. భయపడిన ప్రతి స్పందన్నీ దుయ్యబట్టారు. తమ ప్రశ్నలకు అమిత్ షా సమాధానం ఇవ్వలేదు. ‘ఆయన మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. అది పూర్తిగా రక్షణాత్మక ప్రతిస్పందన. పారదర్శక ఓటరు జాబితా ఇవ్వాలని నేను అడిగా, ఆయన సమాధానం చెప్పలేదు. ఈవీఎంల నిర్మాణం అందరికీ ఇవ్వాలని అడిగాను. ఆయన దాని గురించి ఏమీ చెప్పలేదు’.
నెహ్రూ, ఇందిర, సోనియా ఓట్ చోరీ చేశారు
లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ‘నెహ్రూ, ఇందిర చోరికి ఓటు వేశారు’: అమిత్ షా వర్సెస్ రాహుల్ గాంధీ పార్లమెంటులో తీవ్ర రూపం దాల్చారు. ఓటర్ల జాబితాల్లో జరిగిన అవకతవకలపై తన విలేకరుల సమావేశాలపై చర్చ జరపాలని రాహుల్ గాంధీ కేంద్ర హోంమంత్రిని సవాలు చేయడంతో ఘర్షణ మొదలైంది. సర్‌పై అమిత్ షా అత్యంత గంభీరంగా బదులిచ్చారు. ‘స్పీకర్ సార్, నేను 30 ఏళ్లుగా ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఎన్నికవుతున్నా. నాకు ఈ ప్రక్రియలపై సుదీర్ఘ అనుభవం ఉంది.
పార్లమెంటు మీ కోరికల ప్రకారం నడవదు. నా ప్రసంగం క్రమాన్ని నేను నిర్ణయిస్తాను. పార్లమెంటు ఇలా పనిచేయదు. ‘స్పీకర్ సార్, నా జవాబు వినేంత ఓపిక ఆయనకు ఉండాలి. ప్రతి ఒక్క విషయానికీ నేను సమాధానం ఇస్తాను. కానీ నా ప్రసంగం క్రమాన్ని ఆయన నిర్ణయించలేరు. నేను నిర్ణయిస్తాను’. అనంతరం, అమిత్ షా ప్రశాంతమైన స్వరంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాహుల్ గాంధీ ‘ఓటు చోరీ‘ ఆరోపణలపై పాయింట్- టు- పాయింట్ పద్ధతిలో సమాధానం ఇచ్చారు.
హర్యానాలో ఒకే ఇంటి నుంచి 501 ఓట్ల వేసినట్లు రాహుల్ ఆరోపించిన ‘అణు బాంబు’ను ప్రస్తావించారు. ‘ఆరోపణలు చేసినట్లుగా హౌస్ నంబర్ 265 చిన్న నివాసం కాదు. అది ఒక ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఉమ్మడి, పూర్వీకుల ప్లాట్లో నిర్మించిన అనేక కుటుంబాల నివాసం. ఈ నంబరింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం హర్యానాలో ఉన్నప్పటి నుంచే ఉందని, అవి నకిలీ ఓట్లు కాదు. వాళ్లకు (రాహుల్‌ను ఉద్దేశించి..) కాస్త సహనం ఉండాలి. అన్ని ప్రశ్నలకు జవాబిస్తా. ధైర్యంగా ఉండాలి.
రాహుల్ గాంధీ ఓట్‌చోరీ పేరిట హైడ్రోజన్ బాంబు వేశారు. హర్యానాలో నకిలీ ఓటర్లు ఉన్నారని అంటున్నారు. కానీ అక్కడ ఎలాంటి నకిలీ ఓటర్లు లేరు. నెహ్రూ హయాంలోనే ఓట్ చోరీ జరిగింది. సర్దార్ వల్లాభాయ్ పటేల్‌కు మెజారిటీ వచ్చినా.. నెహ్రూనే ప్రదాని అయ్యారు. ప్రధాని విషయంలో నెహ్రూ ఓట్ చోరీకి పాల్పడ్డారు. అలహాబాద్‌లో ఇందిరా గాంధీ ఓట్ చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. సోనియాగాంధీ భారత పౌరురాలు కాకముందే ఓటేసి ఓట్ చోరీ చేశారు.
విపక్షంలో ఉన్నప్పుడు ఏనాడూ మేం ఈసీని తప్పు బట్టలేదు” అని అమిత్‌సా అన్నారు. ఈ క్రమంలో నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ ఎంపీలపై అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధమైన సంస్థ. సీఈసీని ఎన్నుకునే కమిటీలో ప్రతిపక్ష నేత కూడా ఉంటారు. ఓటర్ల సవరణ బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఎస్‌ఐఆర్ ప్రక్రియ తాము మొదలు పెట్టిందేం కాదని.. ఏనాటి నుంచో కొనసాగుతోందని.. అలాంటప్పుడు దీనిపై చర్చే అనవసరం అని అన్నారాయన. చివర్లో.. భారత్‌లోని విదేవీ ఓటర్లను ఏరిపారేయాల్సిన అవసరం ఉందని షా వ్యాఖ్యానించారు.