18-07-2025 01:08:11 AM
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, జూలై 17 (విజయక్రాంతి) : అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేయడంతో వారికి రక్షణ, ఆరోగ్య సంరక్షణ కలుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం తన చాంబర్ జిల్లా మహిళ, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్ల సంక్షేమశాఖ అధికారి రౌఫ్ ఖాన్, బాలల సంరక్షణ సమితి అధికారి ఆనంద్ లతో కలిసి అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బాలల పరిరక్షణ సమితి పరిధిలోని బాలల సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం పొందుతూ సంరక్షణ, రక్షణ అవసరం ఉన్న అనాథ పిల్లలందరికీ ఆరోగ్య సేవలు ఉచితంగా అందాలనే ఉద్దేశ్యంతో ఆరోగ్యశ్రీ కార్డులు అందించడం జరిగిందన్నారు.
ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సి.ఈ.ఓ., వైద్యశాఖ సహకారంతో జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా సంక్షేమశాఖ సమన్వయంతో జిల్లాలోని ఆరు సంరక్షణ కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న 85 మంది అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను అందించామన్నారు. ఈ కార్డు ద్వారా బాలలు రాష్ర్టంలో ఎక్కడైనా రూ. 10 లక్షల వరకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వయకర్త డాక్టర్ రాధిక, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.