calender_icon.png 21 July, 2025 | 6:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సర్వేయర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాటు

21-07-2025 01:40:59 AM

మహబూబాబాద్, జూలై 20 (విజయ క్రాంతి): భూభారతి కార్యక్రమం లో గ్రామస్థాయిలో సర్వే నిర్వహించడానికి లైసెన్సుడు సర్వేయర్ల శిక్షణ కార్యక్రమం ముగింపు దశకు చేరుకుంది. తరగతి గదుల్లో థియరీ, క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన అభ్యర్థులకు మూడు రోజులు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి లైసెన్స్ జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో చేపట్టిన 50 రోజుల శిక్షణ కార్యక్రమం ఈనెల 26 నాటికి ముగుస్తుంది.

శిక్షణలో అభ్యర్థులకు నిర్వహించిన పరీక్షను పర్యవేక్షిస్తున్న ఏడీ నరసింహ మూర్తి 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 27న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు థియరీలో పరీక్ష ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్లాటింగ్, కాలిక్యులేషన్ కి పరీక్ష నిర్వహిస్తారు. 28, 29 తేదీల్లో క్షేత్రస్థాయికి అభ్యర్థులను తీసుకెళ్లి కొంత భూ విస్తీర్ణం అప్పగించి కొలత వేసి ప్లాటింగ్ చేయటం, అనంతరం కాగితాలపై ప్లాటింగ్, కాలిక్యులేషన్ చేసే పరీక్ష నిర్వహించనున్నట్లు మానుకోట జిల్లా సర్వే ల్యాండ్ రికారడ్స్ ఏడీ నరసింహ మూర్తి తెలిపారు.

అభ్యర్ధులను పరీక్షలకు అనుమతించటం, తదనంతరం ఎంపిక, వారిని మండలాల వారీగా ఎలా ఉపయోగించుకోవాలనే అంశాలపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు అందాల్సి ఉందన్నారు. జిల్లాలో 203 మంది దరఖాస్తు చేసుకోగా, 180 మంది తమ పేర్లను శిక్షణ కేంద్రాల్లో నమోదు చేసుకున్నారు. వీరిలో 150 మంది మాత్రమే రోజువారీ శిక్షణకు హాజరవుతున్నారు.

మానుకోట జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నందు ఈనెల 27, 28, 29 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ప్రకటనల ప్రకారం ప్రతి మండలానికి ఐదు నుంచి ఆరుగురు కొత్త ప్రైవేట్ సర్వేలను తీసుకోని ప్రతి మండలానికి నియమించనున్నారు.