calender_icon.png 21 July, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీవో 49 రద్దు చేసే వరకు ఐక్యంగా ఉద్యమిస్తాం

21-07-2025 05:57:40 PM

జిల్లా బంద్ కు మద్దతుగా జీవో ప్రతులు దగ్ధం..

మందమర్రి (విజయక్రాంతి): ఆదివాసీలను, పేదలను 339 గ్రామల నుంచి, 3 లక్షల ఎకరాల భూముల నుంచి వెలగొట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన జీఓ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు జీవో కాపీలను దగ్ధం చేశారు. జీవో 49 రద్దు చేయాలని ఆదివాసిలను గ్రామాల నుండి, భూముల నుండి తరలించే కుట్రను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసి సంఘాలు ఇచ్చిన జిల్లా బంద్ పిలుపులో భాగంగా పట్టణంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) అధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో, సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో వేరువేరుగా నిరసన వ్యక్తం చేస్తూ జీవో కాపీలను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. బీజేపీ మోడీ ప్రభుత్వం ఆదివాసీ పేదలను వారి గ్రామల నుంచి, భూముల నుంచి వెళ్లగొట్టేందుకు అనేక చట్టాలు చేస్తున్నారని, వీటిని రాష్ట్రంలో అమలు జరపడం కోసం మోడీ ప్రభుత్వానికి మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిఓ 49 జారీ చేసిందని, జీఓ అమలు కోసం దొడ్డి దారిన ప్రయత్నాలు చేస్తుందని వారు మండిపడ్డారు. జిల్లాలో కవ్వాల్ టైగర్ జోన్, ప్రాణహిత కృష్ణ జింకల ప్రాంతం, శివ్వారం మొసళ్ళ కేంద్రం పేర్లతో ఆంక్షలు విధించడం దుర్మార్గమని వారు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా ల వైఖరి ఆదివాసీలకు, పేదలకు వ్యతిరేకంగా, వారి జీవితాలను పూర్తిగా నాశనం చేసేలా ఉన్నాయని, అంతే కాకుండా కార్మిక వర్గాన్ని కార్పొరేట్లకు, బడా పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్రలను మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో ఆదివాసీ, గిరిజన, పేదలే కాకుండా కార్మికవర్గం కూడా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను విరమించు కోకుంటే ఐక్య పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘం సిఐటియు డివిజన్ అధ్యక్షుడు గందం రవి, మండల నాయకులు పెద్ద లచ్చన్న, లక్ష్మి, స్వరూప, రాజేశ్వరి, రాజయ్య, బానయ్య, రవీందర్, వెంకటేషశ్వర్ రావు, నరేష్, అరుణ్ లు పాల్గొన్నారు.