21-07-2025 05:50:35 PM
చిక్కుపడిన హైవే..
హుజురాబాద్‌లో చెరువులా మారిన రహదారి..
ఇబ్బందుల్లో వాహనదారుల ప్రతి వర్షానీకి ఇదే గాధ..
మున్సిపల్ యంత్రాంగంపై ప్రజల అసహనం..
హుజురాబాద్ (విజయక్రాంతి): మోస్తరు వర్షానికే హైవే చెరువులా మారితే, భారీ వర్షాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలంటే భయమే వేస్తోంది. వరంగల్–కరీంనగర్ ప్రధాన రహదారి కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ పట్టణంలోని పెద్ద మోరి ప్రాంతం సోమవారం ఒక్కసారి చిన్నపాటి వర్షం కురిస్తేనే పూర్తిగా జలమయమైంది. హైవేపై నిలిచిన వరద నీరు వాహనదారులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టివేసింది. రహదారిపై ఎక్కడ గుంతలు ఉంటాయోనన్న ఆందోళనతో వాహనాలు నెమ్మదిగా ముందుకెళ్లగా, దాంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వందలాది మంది గంటల తరబడి ఇరుక్కుపోయారు.
ప్రతి వర్షాకాలంలో ఇదే దృశ్యం కనిపిస్తున్నా, మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది హైవేనా..? వరద కాలువా?.. అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసే ముందే డ్రైనేజీ శుభ్రపరచడం, వరద నీరు వెళ్లేందుకు మార్గాలు ఏర్పాటు చేయడం మున్సిపల్ అధికారుల బాధ్యత అయినా, వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తూ, తక్షణమే రహదారి నిర్వహణపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.