19 July, 2026 | 7:48 AM

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

02-06-2024 12:35 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 1 (విజయక్రాంతి): హైదరాబాద్ జిల్లాలోని పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్ తెలిపారు. శనివారం నగరంలోని నిజాం కాలేజీలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో కలిసి ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై రోనాల్డ్‌రోస్ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలకు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపును జూన్  4న ఉంటుందని చెప్పారు. జిల్లాలో 13చోట్ల 16 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పా రు. ఓట్ల లెక్కింపు కోసం జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో 20టేబుళ్లు, మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశామని చెప్పారు.

కేంద్ర ఎన్నికల సంఘం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక అబ్జర్వర్‌ను కేటాయించిందని, జూన్ 4న ఉదయం 5.30 అబ్జర్వర్ సమక్షంలో రాండమైజేశన్ చేసి టేబుల్ వారీగా కేటాయిస్తారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్లు లేని చోట ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8గంటలకు, పోస్టల్ బ్యాలెట్లు ఉన్న చోట 8.30గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు  ప్రారంభమవుతున్నదని చెప్పారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు కోసం 1200 కౌంటింగ్ సిబ్బంది, 1000 మందికి పైగా సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అను దీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ పాల్గొన్నారు.