థేమ్స్ స్ఫూర్తితో మూసీ అభివృద్ధి
పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్
హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, జూన్ 1 (విజయక్రాంతి): లండన్‌లోని థేమ్స్ నది స్ఫూర్తితో మూసీ నదిని అభివృద్ధి చేస్తామని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ తెలిపారు. ఈ క్రమంలోనే కొద్ది నెలల క్రితం పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ, దుబాయ్ వాటర్‌ఫ్రంట్ అధికారులను కలిసి వాణిజ్య అనుసంధానం, పెట్టుబడి నమూనాల్ని అధ్యయనం చేశామని తెలిపారు. ‘విజయక్రాంతి’తో మాట్లాడిన ఆయన మూసీ నది అభివృద్ధిపై పలు ఆసక్తికర అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... ఎమ్మార్డీసీ సంస్థ ద్వారా సుమారు 56 కిలోమీటర్ల మేరకు మూసీ నదితో పాటు మూసీకి అనుసంధానంగా ఉన్న చెరువుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందింస్తున్నాము.
మాస్టర్ ప్లాన్..
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడంతో పాటు పశ్చిమాన ఉన్న ఉస్మాన్‌సాగర్ నుంచి తూర్పున ఉన్న గౌరెల్లి వరకు మూసీ నది హైడ్రోలాజికల్ నమూనాను అధ్యయనం చేస్తాయి. ప్రతి కిలోమీటరుకు ఓవర్‌ఫ్లో పరిస్థితులు, పొడి వాతావరణం, నాలాల ద్వారా మురుగునీరు నదిలోకి ప్రవహించడంతో పాటు గరిష్ఠ నిల్వ పరిమాణాన్ని గుర్తిస్తాం. హైడ్రాలిక్ కోసం అధునిక నమూనాను సిద్ధం చేయడంతో పాటు మూసీ పొడవునా ప్రహరీ గోడల నిర్మాణానికి డీపీఆర్‌నూ సిద్ధం చేస్తాం. ప్రణాళికబద్ధంగా అభివృద్ది చేసి మూసీ నదికి పునరుజ్జీవం తేవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. మూసీ నదిలో కాలుష్యాన్ని తగ్గించి, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. నీటిపారుదల, రెవెన్యూ శాఖల సమన్వయంతో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల యాజమాన్యాన్ని గుర్తించడమే కాకుండా చెరువుల సరిహద్దుల్లో దురాక్రమణాల్ని గుర్తించే ప్రక్రియను చేపడతాం.
సమగ్ర భూ సర్వే..
మూసీ నదిని అభివృద్ధి చేయాలంటే అంత అషామాషీ విషయం కాదు. తొలుత మూసీ నది బఫర్ జోన్‌లో ఆస్తులు, ఆక్రమ నిర్మాణాలను గుర్తించడానికి క్షేత్రస్థాయి సర్వేను నిర్వహిస్తాము. నదికి యాభై మీటర్లలోపు అభివృద్ధికి సంబంధించిన ఎలాంటి అనుమతులు జారీ చేయం. మూసీ నది శుభ్రం, తీరం స్థిరీకరణ, సైకిల్ ట్రాక్‌ల అభివృద్ధి, జాగింగ్ ట్రాక్‌లు, నగర స్థాయిలో ప్రాథమిక సౌకర్యాలు, నాలెడ్జ్ పార్క్, ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తున్నాము. అందులోనే వినోద సౌకర్యరాలు, నీటి కొలనులు వంటివి అభివృద్ధి చేస్తాం. మూసీ నదిలో కాంక్రీట్ డ్యామ్‌లను ఏర్పాటు చేసి, రోడ్ కనెక్టివిటీ అందిస్తాం. వాటిలోనే వంతెనల నిర్మాణం, పాదచారుల జోన్లు, పీపుల్ ప్లాజాలు, హెరిటేజ్ జోన్లు, గ్రీన్ స్పేస్‌లు, హాకర్ జోన్లు, పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం. అక్కడే క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాల్ని పొందుపరుస్తాం. మూసీ వెంట ఉన్న చెరువులను గుర్తించి, వాటికి సరిహద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లు, ఇన్‌లెట్, అవుట్‌లెట్లను నిర్వహించడానికి ప్రణాళికల్ని రచిస్తున్నాం.






