5 May, 2026 | 3:07 PM

మీర్‌పేట్ కాలేజీకి మోక్షమెప్పుడో?

24-06-2024 02:47 AM
  • 300 మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం
  • రోజు కళాశాలకు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వైనం
  • ప్రారంభోత్సవానికి రాజకీయ కోణమే కారణమా?

మహేశ్వరం, జూన్ 2౩ : రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం ప్రారంభోత్సవం ప్రశ్నార్థకంగా మారింది. జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కాలేజీలు ప్రారంభమైనా ఇక్కడ మాత్రం నేటికీ మొదలు కాలే దు. కొత్తగా కట్టిన భవనం ప్రారంభించకపోవడంతో తరగతుల నిర్వహణకు అవ కాశం లేకుండా పోతోంది. ప్రతి రోజు ఉదయం విద్యార్థులు కాలేజీ వరకు వచ్చి చెట్ల కింద కాసేపు సేద తీరి వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.  కళాశాలలో మొత్తం 300 మంది విద్యార్థులు ఉన్నారు. ఎప్పుటి నుంచి కళాశాలలో పాఠాలు మొదలవుతాయోనని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కళాశాలను ప్రారంభించాలని విద్యార్థులు కోరుతున్నారు.

అధికారుల్లో చిత్తశుద్ధి కరువు

మీర్‌పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో గతంలో ఇరుకు గదుల్లో జూనియర్ కళాశాల కొనసాగేది. గత ప్రభుత్వ హయాంలో మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి చొరవతో రూ. 2.35కోట్లు మంజూరయ్యాయి.  విశాలమైన ఖాళీ స్థలంలో పది గదులు జూన్1వ తేదీ 2024 నాటికల్లా పూర్తయ్యాయి. కానీ, ఇప్పటివరకు వాటిని ప్రారంభించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీన ప్రారంభిస్తామని చెప్పినా ఆచరణకు నోచుకోకపోవడంపై విద్యార్థుల్లో నైరాశ్యం నెలకొంది.  

ప్రారంభోత్సవంపై రాజకీయ నీడ

మీర్‌పేట్ కళాశాల ప్రారంభోత్సవంపై రాజకీయ కోణం కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది. పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువుకునే కళాశాల ప్రారంభోత్సవం పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.   స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే విద్యాశాఖ కూడా ఉంది.అయినప్పటికీ ఈ నిర్లక్ష్యం ఏమిటీ అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

స్కూలు గదులే దిక్కు..

ఏడాది క్రితం ఇంటర్ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణం ప్రారంభమైంది. గతంలో 164 మంది విద్యార్థులు ఉండేవారు. కొత్తగా మరో 136 మంది విద్యార్థులు కళాశాలలో చేరారు. ప్రస్తుతం 300 మంది విద్యార్థులు ఉన్నారు. జూన్ 1వ తేదీన కాకుండా ఈ నెల 19వ తేదీన కళాశాల ప్రారంభోత్సవం అయ్యేందుకు సన్నాహాలు చేసినట్లు పై అధికారులు తెలిపారు. అయితే ఇప్పటివరకు అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. నూతన భవనం ప్రారంభోత్సవం అయ్యే వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గదుల్లోనే కాలేజీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం...

 -సైదులు, ప్రిన్సిపాల్