14 August, 2026 | 2:27 AM

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తి

14-08-2026 01:05 AM

ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకట స్వామి 

మెదక్, ఆగస్టు 13 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను శనివారం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.

ఆగస్టు 15న ఉదయం 9:30 గంటలకు జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ప్రాంగణంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు, భూగర్భ శాస్త్ర మంత్రిత్వ శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని కలెక్టర్ వెల్లడించారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, సాధించిన పురోగతిని సమగ్రంగా తెలిపేలా ముఖ్య అతిథి ప్రసంగం నివేదిక తయారు చేస్తున్నట్టు చెప్పారు. ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, అధికారులు, విద్యార్థులు, యువత మరియు జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.