‘మనదేశం’ చిత్ర వజ్రోత్సవానికి ఏర్పాట్లు
నందమూరి తారక రామారావు నటించిన ప్రప్రథమ చిత్రం ‘మనదేశం’. 1949, నవంబర్ 24న విడుదలైన ఈ సినిమా ఈ ఏడాది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా డిసెంబర్ 14న వేడుక నిర్వహించాలని చిత్ర పరిశ్రమ ప్రముఖులు కొన్ని రోజులుగా సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఫిల్మ్ చాంబర్‌లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేశారు.
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర వాణిజ్య మండలి, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, తెలుగు సినీ రైటర్స్ అసోసియేషన్, తెలుగు సినీ దర్శకుల సంఘం బాధ్యులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘మనదేశం’ చిత్ర వజ్రోత్సవాన్ని విజయవాడలో నిర్వహించాలని నిర్ణయించి, ఏర్పాట్లపై చర్చించారు. ఈ వేడుకకు సినీ ప్రదర్శకులు, పంపిణీదారులు, నిర్మాతలు తదితర ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.






