కాపర్ వైర్ చోరీకి పాల్పడుతున్న వ్యక్తుల అరెస్ట్
బర్మా నుండి వలస వచ్చిన ముఠా
నల్లగొండ క్రైం, జూన్ 11 : విద్యుత్ ట్రాన్స్ పార్మర్ లో ఆయిల్, కాపర్ చోరీలకు పాల్పడుతున్న ముఠా ను పోలీస్లు అరెస్ట్ చేశారు. గురువారం నల్లగొండ డిఎస్పి శివరాంరెడ్డి తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. ట్రాన్స్ పార్మర్ లోని కాపర్ వైర్, ఆయిల్ దొంగతనాలకు పాల్పడుతున్న గ్యాంగ్ లీడర్ హమీద్ హుస్సేన్, అతని గ్యాంగ్ (రోహింగ్య) కు చెందిన 5 గురిని అరెస్టు చేసినట్టు తెలిపారు.
నార్కెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నార్కట్ పల్లిలో హైదరాబాద్ -విజయవాడ రహదారి రెడ్డయ్య ఫ్యాక్టరీ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా. మూడు బైకులపై ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని విచారించగా బర్మా నుండి వలస వచ్చి హైదరాబాద్ బాలాపూర్ లో నివాసం అంటున్న హమీద్ హుస్సేన్, జహంగీర్ ఆలం, నూర్ కాసిమ్ నూరుల్ అమీన్, నూరుల్ ఆలం అలియాస్ మహబూబ్ ఆలంలుగా తమ వివరాలు చెప్పారన్నారు.
12 ఏళ్ళ క్రితం బర్మ నుండి హైదరాబాద్ కు వలస వచ్చి బాలానగర్ లో ఉంటూ వివిధ ప్రాంతాల్లో చోరికి పాల్పడినట్లు ఒప్పుకున్నారన్నారు. రాత్రి సమయంలో ఆటోలను అద్దెకు మాట్లాడుకుని ట్రాన్స్ పార్మర్లను కట్ చేసి ఆయిల్, కాపర్ వైర్ దొంగిలించి ఆటోలో తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులకు అమ్ముకుని, వచ్చిన డబ్బులను అందరం సమానంగా పంచుకుని వాటిని వారి కుటుంబ అవసరాలకు జల్సాలకు వినియోగించుకునేవారన్నారు. కేసులో కీలక పాత్ర పోషించిన సీసీస్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, నార్కట్పల్లి సీఐ నాగరాజు, ఎస్‌ఐ సతీష్ వర్మ, నార్కట్పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి, హెడ్ కానిస్టేబుళ్లు విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషా, కానిస్టేబుళ్లు అస్రార్, శివరాజ్, నరేష్, జునేద్, కమల్ కిషోర్లను అభినందించారు.






