3 June, 2026 | 1:50 AM

4 నాటికి కేరళంకు నైరుతి రాక

03-06-2026 01:19 AM
  1. ఈ నెల రెండో వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం
  2. ఫసిఫిక్’లో ఎల్ నినో ప్రభావంతో కొంత ఆలస్యం
  3. సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం
  4. భారత వాతావరణశాఖ కొత్త అంచనా

న్యూఢిల్లీ, జూన్ ౨: నైరుతి రుతపవనాల రాక మరింత ఆలస్యమవుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ నెల ౪ నాటికి కేరళంను రుతపవనాలు తాకే అవకాశం ఉందని తెలిపింది. అలాగే, ఈసారి సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే వాతవరణ పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది. నిన్నమొన్నటి వరకు సగటు వర్షపాతం 92 శాతం నమోదవుతుందని చెప్పిన ఐఎండీ, తాజాగా ఆ అంచనాను 90 శాతానికి కుదించడం గమనార్హం.

వాస్తవానికి గత నెల 26నే రుతుపవనాలు కేరళం తీరాన్ని తాకనున్నాయని ఐఎండీ అంచనా వేసింది. కానీ, ఫసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో కారణంగా రుతుపవనాలు మందగమనం కొనసాగుతున్నదని వెల్లడించింది. రుతుపవనాలు చురుగ్గా, వేగంగా ముందుకు కదలాలంటే పడమర నుంచి వీచే గాలులు కనీసం ౪ మీటర్ల ఎత్తులో పయనించాలని, కానీ.. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం వల్ల పవనాలు 1.5 మీటర్ల ఎత్తులో మందకొడిగా ముందుకు సాగుతున్నాయని తెలిపింది.

ఈ నెల రెండో వారంలో అవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. గతేడాది, ఐఎండీ అంచనా వేసిన సమయానికంటే ఎనిమిది రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఆ తర్వాత మే 26న తెలంగాణలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం రుతుపవనాల రాక ఆలస్యమవుతున్నది. దీంతో ఖరీఫ్ సాగు మరింత ఆలస్యం కానున్నది. ఈ పరిస్థితి వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేయనుంది. ప్రస్తుతం దేశంలో సుమారు 60 శాతం రైతులు వర్షాధార పంటలే పండిస్తున్నారు. రుతుపవనాలు ఆలస్యమై వర్షపాతం తగ్గుతున్నందున పంటల దిగుబడి సైతం తగ్గనుంది.