3 June, 2026 | 1:49 AM

మా అంతర్గత విషయాల్లో జోక్యం వద్దు

03-06-2026 01:15 AM
  1. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ భారత్‌లోని అంతర్భాగాలు
  2. భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్
  3. కశ్మీర్ అంశంపై ఈయూ, పాకిస్థాన్ వాఖ్యలపై ఫైర్ 

న్యూఢిల్లీ, జూన్ ౨: జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలేనని, ఈ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ హితవు పలికారు. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్ విషయంలో తాజాగా పాకిస్థాన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) సంయుక్తంగా చేసిన ప్రకటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభాన్ని జమ్మూకశ్మీర్ అంశంతో పోల్చడం ఏంటని నిలదీశారు.

న్యూఢిల్లీలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ అంశాన్ని ప్రస్తావనకు తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైనా -పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (సీపెక్) ప్రాజెక్టులపైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన ప్రాంతాల్లో చైనా చేపడుతున్న ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు.