13-01-2026 10:26:35 PM
శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి
శివంపేట్,(విజయక్రాంతి): రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని పురస్కరించుకొని శివంపేట ఎస్సై మధుకర్ రెడ్డి వారి సిబ్బందితో “అరైవ్ అలైవ్” అనే రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని దొంతి, చండి గ్రామాల యందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం, హెల్మెట్ ధరించడం, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదని, అధిక వేగం నివారించాల్సిన అవసరం వంటి ముఖ్య అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోతే ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, కుటుంబాలపై పడే దుష్పరిణామాల గురించి వివరించారు.
ఈ సందర్భంగా కొన్ని రోడ్డు ప్రమాదాల బాధితులు తమ వ్యక్తిగత అనుభవాలు, ఎదుర్కొన్న కష్టాలు, మానసిక వేదనలను ప్రజలతో పంచుకుని, రోడ్డు భద్రత ఎంత ముఖ్యమో తెలియజేశారు. వారి అనుభవాలు ప్రజలపై గాఢమైన ప్రభావం చూపాయని పోలీసులు తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్రజలు రోడ్డు భద్రతపై మరింత బాధ్యతగా వ్యవహరించాలని, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడుకునే విధంగా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.