2 May, 2026 | 11:33 AM

పసుపు బోర్డు పేరిట అర్వింద్ పంగనామం

11-05-2024 01:06 AM

ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

నిజామాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్

నిజామాబాద్, మే 10 (విజయక్రాంతి): పసుపు బోర్డు పేరిట ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత పంగనామం పెట్టారని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. నిజామాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో శుక్రవారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడారు. అర్వింద్ నిజామాబాద్ జిల్లా సమస్యలపై పార్లమెంట్‌లో ఒక్కసారైనా గొంతెత్తలేదని ధ్వజమెత్తా రు.

గల్ఫ్ బాధితులను ఆదుకుంటానని, వారి సమస్యలపై కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తానని, యువతకు స్కిల్ డెవలప్‌మెంట్ శిక్షణ ఇప్పిస్తానని, మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపిస్తానని గప్పాలు కొట్టి తర్వాత ఆ సంగతే మరచిపోయారన్నారు. తనను ఎన్నికల్లో గెలిపిస్తే పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తానన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపైనే చర్చ జరుగుతుందన్నారు.

వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని గద్దెనెక్కి, ఇప్పడు వాయిదా వేయడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి చేస్తారని అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించిందని, పంటల కోసం సాగునీటి ప్రాజెక్టులు నిర్మించిందని గుర్తుచేశారు. 2014 ఎన్నికల సమయంలో ప్రతి నిరుపేద బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తానని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోదీ దేశ ప్రజలను మోసం చేశారన్నారు.

దేశాన్ని మతతత్వం అనే మత్తులోకి దించుతున్నదని ఆరోపించారు. అవరోధాలన్నిం టినీ దాటి పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. గల్ప్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపుతానన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్‌రెడ్డి గతంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచి వెనుకబడిన వర్గాలను అణగదొక్కారన్నారు. తన సామాజిక వర్గానికే ప్రాధాన్యమిచ్చారన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు యత్నిస్తున్నాయన్నారు.