2 May, 2026 | 12:58 PM

బీజేపీ ‘అభివృద్ధి’ మిథ్య

11-05-2024 01:08 AM

ఆ పార్టీ పాలిత రాష్ట్రాలు ఎందుకు ఎదగలేదు?

బీజేపీ వస్తే సమాజం రెండుగా చీలుతుంది 

2025 నాటికి రిజర్వేషన్లు లేకుండా చేసే కుట్ర  

పదేళ్ల కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్వంసం 

మీట్ ది ప్రెస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, మే 10 (విజయక్రాంతి): భావోద్వేగాలను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్న   బీజేపీ, తెలంగాణలోకి అడుగు పెడితే సమాజం రెండుగా చీలుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. సమాజాన్ని నిలువునా చీల్చాలను కున్న బీజేపీకి రాష్ట్రాన్ని అప్పగించాలనే కుట్ర జరగుతోందని, అందుకు బీఆర్‌ఎస్ పూర్తిగా సహకరిస్తోందని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డితో మీట్ ది ప్రెస్ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేంద్రం లో మూడోసారి అధికారంలో రాగానే రిజర్వేషన్లు రద్దుచేయాలని బీజేపీ, మోదీ  చూస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, ప్రజల స్వేచ్ఛ కోసం కొట్లాడాలని ఎన్నికల బరిలోకి దిగిందని తెలిపారు. అన్ని ప్రభుత్వ సంస్థలను బీజేపీ చెరపట్టిందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి, సంక్షేమం జరగలేదని, దేశ రాజధాని ఢిల్లీకి కూతవేటు దూరంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ప్రభుత్వ విధానాల వల్ల పెట్టుబడులు రాలేదని తెలిపారు.

ఎంతో మంది త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అయితే ఉద్యమ పార్టీగా చెప్పుకునే బీఆర్‌ఎస్‌ను ఒక రాజకీయ పార్టీగా విస్తరించి అన్ని ప్రయోజ నాలను కేసీఆర్ సంపూర్ణంగా అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేశా రన్నారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని పేర్కొన్నారు. కేసీఆర్ పదేళ్ల కాలంలో వందేళ్ల విధ్వంసం జరిగిందని విమర్శించారు. దేశ ప్రజల ఆలోచన, విధానాలకు అనుగుణంగా కాంగ్రెస్ పనిచేస్తుందని తెలిపారు. బలహీన వర్గాల అభివృద్ధికి తోడ్పడేలా రాజ్యాంగం రచన జరిగిందని చెప్పారు. రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని అన్నారు. 

మతా లు, భాషలు, వ్యక్తుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల ఆస్తులు గుంజుకుంటుందని మోదీ విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 2025 నాటికి దేశంలో రిజర్వేషన్లు లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. రాజ్యంగం మార్పు కోసం జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ ఇచ్చిన నివేదికను దాచిపెట్టారని తెలిపారు. ఎన్నికల కోడ్ ఉండగానే కేంద్ర హోంశాఖ తనపై ఫిర్యాదు చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.