ప్రశ్నించే గొంతుకకు ప్రజలు అవకాశం ఇవ్వాలె..
ఎన్నికల్లో గెలిపించి పార్లమెంట్‌కు పంపాలె
బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
మంథని, మే10 (విజయక్రాంతి): ‘ప్రజలు ప్రశ్నించే గొంతుకకు ప్రజలు అవకాశం ఇవ్వాలె.. ఎన్నికల్లో గెలిపించి పంపాలె’ అని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. మంథని పట్టణంలోని గాంధీచౌక్‌లో శుక్రవారం ఆయన జడ్పీచైర్మన్ పుట్ట మధుతో కలిసి నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. అబద్ధాలు ఆడటం, ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ అలవాటుగా మారిందని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైందని, ఆరు గ్యారెంటీల్లో ఒక్కటైనా పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ హయాంలో మంథని నియోజవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిం దని, కాళేశ్వర్ ప్రాజెక్ట్‌తో తెలంగాణ సస్యశ్యామలమైందన్నారు. కరువు తీరి రైతులకు మేలు జరిగిందన్నారు.
జడ్పీ చైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంథనిలో ఎస్‌ఎస్‌ఆర్ ట్యాక్స్ పేరుతో ఆ పార్టీ నేతలు వసూళ్లకు తెరతీశారన్నారు. మున్సిపాలిటీ తన సతీమణి చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడు ఎలాంటి అవినీతి అక్రమాలు జరగలేదన్నారు. కానీఇప్పుడు కాంగ్రెస్ హయాంలో టాక్స్ చెల్లిస్తేనే ప్రజలకు పనులు అవుతున్నాయని ఆరోపిం చారు. ప్రచారంలో బీఆర్‌ఎస్ నాయకులు కుమార్, ఎక్కేటి అనంతరెడ్డి, రవిగౌడ్, భాగ్యలక్ష్మితిరుపతి, సత్యనారాయణ పాల్గొన్నారు.






