అలవోకగా

11-07-2024 12:10:00 AM

  • మూడో టీ20లో భారత్ విజయఢంకా

23 పరుగులతో జింబాబ్వే చిత్తు 

మెరిసిన గిల్, రుతురాజ్, సుందర్

జింబాబ్వేతో పొట్టి సిరీస్‌లో యంగ్‌ఇండియా అదరగొడుతోంది. తొలి పోరులో పరాజయం నుంచి త్వరగానే తేరుకున్న శుభ్‌మన్ గిల్ సేన.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. బ్యాటింగ్‌లో గిల్, రుతురాజ్ మెరుపులకు బౌలర్ల సమష్టి కృష్టి తోడవడంతో మూడో టీ20లో యంగ్‌ఇండియా విజయ పతాక ఎగరేసింది. రవి బిష్ణోయ్ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్ జింబాబ్వే బ్యాటర్లకు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌లో సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది.

హరారే: పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్ టీమిండియా.. స్థాయికి తగ్గ ఆటతీరుతో దూసుకెళ్తోంది. జింబాబ్వేతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన మూడో టీ20లో యంగ్‌ఇండియా 23 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో గిల్ సేన 2 ఆధిక్యంలో నిలిచింది. తొలి పోరులో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన మన బ్యాటర్లు.. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ దంచికొట్టారు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

గత రెండు మ్యాచ్‌ల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన కెప్టెన్ గిల్ (49 బంతుల్లో 66; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. రుతురాజ్ గైక్వాడ్ (28 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), యశస్వి జైస్వాల్ (36; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కీలక పరుగులు చేశారు. గత మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగి 10 పరుగులు చేసి వెనుదిరిగాడు. జింబాబ్వే బౌలర్లలో సికందర్ రజా, ముజర్బానీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది. టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, శివమ్ దూబేతో పాటు.. ఖలీల్ అహ్మద్‌కు తుదిజట్టులో చోటు దక్కింది. వీరి కోసం సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, ముఖేశ్‌కుమార్‌ను పక్కన పెట్టారు.

అనంతరం లక్ష్యఛేదనలో జింబాబ్వే 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకు పరిమితమైంది. డియాన్ మేర్స్ (65 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్), క్లువ్ మదండె (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. ఒక దశలో 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జింబాబ్వేను ఈ జంట ఆదుకుంది. మన బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అవేశ్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడే నాలుగో టీ20 జరగనుంది. 

సంక్షిప్త స్కోర్లు

భారత్: 20 ఓవర్లలో 182/4 (గిల్ 66, రుతురాజ్ 49; రజా 2/24, ముజర్బానీ 2/25), 

జింబాబ్వే: 20 ఓవర్లలో 159/6 (డియాన్ మేర్స్ 65 నాటౌట్, క్లువ్ మదండె 37; సుందర్ 3/15, అవేశ్ 2/39).