23 August, 2026 | 3:35 AM

చదువుల సంగతి!

23-08-2026 12:00 AM

భావిభారత పౌరుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, విద్యార్థులు ఎదుర్కొంటున్న అవస్థలను ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమం అధికార వర్గాల్లో కాక పుట్టిస్తున్నది. సీజేపీ ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను సందర్శిస్తూ, అక్కడి వాస్తవ పరిస్థితులను వెలుగులోకి తీసుకొస్తుండటాన్ని పార్టీలకతీతంగా అందరూ స్వాగతించాల్సిందే.

ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలలను బయటి వ్యక్తులు సందర్శించకూడదన్న రాజస్థాన్ సర్కార్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ, ఓ గ్రామానికి వెళ్లిన సీజేపీ ప్రతినిధి ఆశుతోష్ రంకాపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడి వెనుక బీజేపీ అనుబంధ రౌడీ మూకలు ఉన్నాయని సీజేపీ ఆరోపించడం గమనార్హం. అయితే, ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లోకి వెళ్లే అధికారం బయటి వ్యక్తులకు ఎక్కడిదనే ప్రశ్న ప్రధానంగా వినవస్తున్నది.

పాఠశాలలు రాజకీయ ప్రచార వేదికలు కాకూడదన్న వాదనను ఈ సందర్భంగా మనం కొట్టిపారేయలేం. విద్యార్థుల భద్రత దృష్ట్యా అనుమతి లేకుండా పాఠశాలల్లోకి వెళ్లడం సమర్థనీయమూ కాదు. అదే సమయంలో బయటి వ్యక్తుల ప్రవేశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్న వారు తమ బాధ్యతలను విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పాఠశాలలను నిత్యం పర్యవేక్షిస్తూ, వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగానిదే.

వారు ఇప్పటివరకు తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ఉంటే, సీజేపీ వంటి వారు పాఠశాలల్లోకి ఎందుకు వెళ్తారనే వాదనలను విస్మరించలేం. పాఠశాలల్లో దుస్థితిని ఎండగడుతూ ఇతరులు వేలెత్తి చూపుతున్నారంటే, అది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. దేశంలో ఇప్పటికీ చెట్ల కింద చదువులు చెప్తుండటంతోపాటు తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు వంటి కనీస వసతులు లేని పాఠశాలలు ఇంకా ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. విద్యాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాయి.

కానీ, ఆ నిధులు పాఠశాలల రూపురేఖలను మార్చడం లేదు. ఈ నేపథ్యంలో విద్యకు కేటాయింపులు ఎంత? ఎంతమేరకు ఖర్చు చేశారు? అనే నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. కాగా, పాఠశాలలను సందర్శించే హక్కుపై వాదోపవాదాలను పక్కనపెడితే, ఆ చర్చ మాటున అసలు సమస్య కనుమరుగు కాకూడదని చెప్పక తప్పదు.