23 August, 2026 | 3:35 AM

పీసా చట్టం నిర్వీర్యం

23-08-2026 12:00 AM

భారతదేశంలోని షెడ్యూల్ ప్రాంతాలలో గిరిజన తెగలకు స్వపరిపాలనను అందించడానికి, వారి సాంప్రదాయ గ్రామసభల ద్వారా ఏజెన్సీ వనరులపై హక్కులను రక్షించడానికి కేంద్రం తీసుకొచ్చిన ఒక ముఖ్యమైన చట్టం పీసా. ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ సంక్షేమ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించడానికి, అభివృద్ధి ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామపంచాయతీలో ఒక్కో పీసా మొబిలైజర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

వీరు గ్రామ పంచాయతీల్లో ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, గ్రామ సభలకు గిరిజనులు హాజరయ్యేటట్లు చూడాలి. ఏజెన్సీలో ప్రభుత్వా లు చేపట్టే ప్రాజెక్టులు, అభివృద్ధి పనులపై గ్రామసభలో చర్చించి, అనుమతులు తీసుకోవటం, ఆదివాసీలకు సంక్షేమ పథకాలు అందేలా చూడటం, వారి హక్కులను కాపాడటం పీసా మొబిలైజర్ల ప్రధాన బాధ్యత. చట్ట ప్రకా రం వీరు నిత్యం ఆదివాసీ గ్రామాలలో ఉంటూ ప్రజలను చైతన్యపరచాలి.

ఇంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సిన పీసా మొబలైజర్లు గ్రామాల్లో కనీసం కనిపిస్తున్న దాఖలాలు లేవు. జిల్లా స్థాయిలో ఐటీడీఏ, జిల్లా పంచాయతీ అధికారి వీరి విధులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. మండల, జిల్లా స్థాయి అధికారులు పీసా మొబిలైజర్లు రోజూ విధులకు వస్తున్నారా, లేదా అనే లాగ్‌బుక్స్, అటెండెన్స్ సరిగ్గా చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. గ్రామసభ మొబిలైజర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో వారి ఉనికి కరువైందనేది అక్షరాలా నిజం.

అయి తే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల పీసా మొబిలైజర్ల పోస్టుల సంఖ్యను భారీగా తగ్గించాయి. గతంలో ప్రతి గ్రామానికి ఒకరు ఉండేవారు. కానీ, ఇప్పుడు కొన్ని మండలాల్లో వారి ఉనికే లేదు. ఉదాహరణకు ఒక మండలంలో 24 పంచాయతీలు ఉంటే, 8 లేదా 10 మంది మాత్రమే మొబిలైజర్లు పని చేస్తున్నారు. ఉన్న కొద్దిమంది మొబిలైజర్లు కూడా గ్రామసభలకు హాజరుకావడం లేదు.

ఆదివాసీ సర్పంచ్‌లు, స్థానిక నేతలకు ఈ పీసా మొబిలైజర్ల గురించి అవగాహన లేకపోవడంతో వారు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో భూములు, అడవులు, ఇసుక క్వారీలు, స్థానిక వనరులపై నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు ‘పీసా గ్రామసభ’కు ఉంటుంది. ఈ సభలను నడిపించడంలో మొబిలైజర్లదే కీలక పాత్ర.

గౌరవ వేతనాలు చాలా తక్కువగా ఉండటం, అవీ సకాలంలో విడుదల కాకపోవడంతో ఈ ఉద్యోగంపై వారు శ్రద్ధచూపడం లేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఏజెన్సీ లో పీసా మొబిలైజర్లను నియమించాలి. పీసా చట్టాన్ని ఏజెన్సీలో కచ్చితంగా అమలు చేయాలని ఆదివాసీలు కోరుతున్నారు.

 వూకె రామకృష్ణ దొర, 9866073866