సంగీతం ఉన్నంతకాలం ఘంటసాల ఉంటారు
గాయకుడు ఘంటసాల వేంకటేశ్వరరావు బయోపిక్ ‘ఘంటసాల ది గ్రేట్’. కృష్ణచైతన్య టైటిల్ పాత్ర పోషిస్తుండగా, ఘంటసాల భార్య సావిత్రి పాత్రలో కృష్ణచైతన్య భార్య మృదుల నటిస్తున్నారు. సీహెచ్ రామారావు దర్శకత్వంలో సీహెచ్ ఫణి నిర్మిస్తున్నారు. 2025, ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఆదివా రం హైదరాబాద్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.. ‘సంగీతం ఉన్నంత కాలం ఘంటసాల ప్రజల మనసుల్లో ఉంటారు’ అన్నారు. ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘ఘంటసాల స్వాతంత్య్ర పోరాటంలోనూ పాల్గొన్నారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలి. ఎంజీఆర్‌కు భారతరత్న ఇచ్చి ఎన్టీఆర్‌కు ఇవ్వలేదు. ఆయనకూ ఇవ్వాలి’ అన్నారు. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. ‘కృషితో నాస్తి దుర్భిక్షం, వినయంతో విద్య ప్రకాశిస్తుందని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఘంటసాల.
ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మా సినిమాలో చెప్పాం. భారతదేశ సినిమా చరిత్రలో ఏ గాయకుడి మీదా పూర్తిస్థాయి నిడివి సినిమా రాలేదు’ అన్నారు. కార్యక్రమంలో చిత్రబృందం, ఇండస్ట్రీ ప్రముఖులు పాల్గొన్నారు.






