నేటి కథ.. నాటి సినిమా
ఈరోజుల్లో సెంటిమెంటుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కానీ ఆ రోజుల్లో చాలా ప్రాధాన్యత ఉండేది. పాత చిత్రాలు ముఖ్యంగా రెండు, మూడు జోనర్లే ఉండేవి. వీటిలోనూ ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలే ఉండేవి. సెంటిమెంటుతో పాటు ఒక మెసేజ్‌ను కూడా జోడించి వదిలేవారు. అంతే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 100 రోజులు.. 200 రోజులు.. సెంటిమెంటు మరీ పండితే 365 రోజులు ఆడిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవే చిత్రాలను కొత్త సీసాలో పోసి అందిస్తున్నారు. ఇప్పటి తరానికి అవి సరిగ్గా సరిపోతాయి.
అ ప్పట్లోనే ఆయా చిత్రాలను ఎందుకు తీసినట్టు? అవి కాలాతీత చిత్రాలు కావా? అనే సందేహం రాక మానదు. సినిమా అంటేనే ఊహా ప్రపంచం. కాబట్టి మున్ముందు ఏం జరుగనుందో ఊహించి తీసి ఉండొచ్చు. మున్ముందు తరాలను దృష్టిలో పెట్టుకుని తీసి ఉంటారు. ఇలా నేటి తరానికి సరిగ్గా సరిపోయే చిత్రాలు వచ్చేసి.. ‘తాత మనవడు, బడిపంతులు, ఆత్మబంధువు’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
వృద్ధులైన తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాలని చెప్పే చిత్రమే ఇది. ఇప్పుడు మనం అనుసరించిన మార్గాన్ని మన పిల్లలు సైతం అనుసరిస్తారని చెప్పే సెంటిమెంటుతో కూడిన సందేశాత్మక చిత్రమిది. ‘బడిపంతులు’ కూడా సెంటిమెంటుతో కూడిన చిత్రమే. ఎన్టీ రామారావు బడిపంతులు. రెక్కల కష్టంతో ఓ ఇల్లు కట్టుకుంటాడు. ఆయన భార్య అంజలీదేవి. నిజాయితీ, విలువలతో కూడిన జీవితం గడుపుతుంటారు.
ఎన్టీఆర్ రిటైర్‌మెంట్ అనంతరం భార్యాభర్తలను కొడుకులు తమ స్వార్థం కోసం విడదీస్తారు. తల్లినొకరు.. తండ్రినొకరు పంచుకుంటారు. వారిద్దరూ లేఖల ద్వారా కాలం గడుపుతుంటారు. వారిద్దరి అవస్థను చూసిన ఎన్టీఆర్ స్టూడెంట్ (జగ్గయ్య) వారిద్దరికీ ఒక గూడు ఏర్పాటు చేసి ఒకచోటుకు చేరుస్తాడు. కన్నబిడ్డల కన్నా సాయం పొందిన బయటివారే మానవత్వంతో వ్యవహరిస్తారని తెలియజేస్తుందీ చిత్రం.
కలిమిలేముల్లోనూ కలిసి మెలిసి..
‘ఆత్మబంధువు’ సైతం ఈ కోవకు చెందిన చిత్రమే. ఈ చిత్రంలో రావు బహద్దూర్ (ఎస్వీ రంగారావు), పార్వతమ్మ (అంజలి) దంపతులుగా నటించారు. వీరిది పెద్ద కుటుంబం. ధనికుడైన రావు బహద్దూర్‌కు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రావు బహద్దరూర్, పార్వతమ్మ దంపతులు ఒకరోజు ఒక పిల్లవాడిని తెచ్చి పెంచుకుని పెరిగి పెద్దయ్యాక వివాహం చేస్తారు. ఒకానొక దశలో రావు బహద్దూర్‌కు ఆస్తులన్నీ పోతాయి.
దీంతో ఆయన్ను సొంత కొడుకులే అవమానిస్తారు. పెంచుకున్న కొడుకు మాత్రం వారిని దగ్గరకు తీస్తాడు. ఇవన్నీ చూస్తుంటే కాలాతీత చిత్రాల మాదిరిగానే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల పిల్లలు అత్యంత గౌరవంతో మెలిగేవారు. కలిమిలేముల్లోనూ కలిసి మెలిసి ఉండేవారు.
ఉమ్మడి కుటుంబాలే దాదాపు అన్నీ. కుటుంబ పెద్ద మాటను కుటుంబమంతా జవదాటేది కాదు. మరి అలాంటి సమయంలో ఇలాంటి చిత్రమా? అంటే.. అది కచ్చితంగా మున్ముందు తరాలకు ఓ మెసేజ్ ఇచ్చారని భావించవచ్చు.
నాడూ.. నేడు ఒకే కథ..
ఈ కాలంలోనూ నాటి చిత్రాలకు సరిపోయే చిత్రాలొచ్చాయి. కుటుంబ కథలను హైలైట్ చేసే చిత్రాలు చాలా ఉన్నాయి. తాత మనవడు సినిమాను హిందీలో అమితాబ్ బాగ్‌బన్‌గా తెరకెక్కించారు. అచ్చుగుద్దినట్టుగా అదే స్టోరీ. అయితే ఆయన కొత్త సీసాలో పోసి హంగూ ఆర్భాటాలు జోడించి అందించారు. వాస్తవానికి ప్రస్తుత పరిస్థితులకు చక్కగా సరిపోయే చిత్రం కావడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
సాయి దుర్గా తేజ్ హీరోగా రూపొందిన ‘ప్రతిరోజూ పండగే’ చిత్రం కూడా తాతామనవళ్ల బంధాన్ని కళ్లకు కడుతుంది. తాత కోసం మనవడు తన తల్లిదండ్రులను విదేశాల నుంచి స్వగ్రామానికి రప్పించడం వంటి ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం రూపొందింది. ఇది కూడా మంచి హిట్ సాధించింది. ఇక ఆత్మబంధువు చిత్రానికి సరిపోయే నేటి చిత్రాలైతే చాలానే ఉన్నాయి. నాడూ, నేడు ఒకే కథ అయినా కూడా మంచి సక్సెస్ సాధించాయి. కుటుంబ కథలకు కూడా కాలం చెల్లిపోలేదని ఆయా చిత్రాలు చెబుతున్నాయి.
ఈ చిత్రాల్లో సందేశం కూడా జనాలకు బాగా కనెక్ట్ అవుతుంది. ఆ తరువాత దాన్ని ఎంతమేర పాటిస్తారనేది చెప్పలేం కానీ ఒక అద్భుత ప్రయత్నం అయితే దర్శకులు చేశారనే చెప్పాలి. మొత్తానికి సెంటిమెంటుతో ప్రేక్షకులతో కన్నీరు పెట్టించిన చిత్రాలే ఇవన్నీ.






