అసదుద్దీన్.. జై పాలస్తీనా
- లోక్‌సభలో ప్రమాణం సందర్భంగా నినాదం
- తీవ్ర అభ్యంతరం తెలిపిన బీజేపీ ఎంపీలు
- అసద్ వ్యాఖ్యలు రికార్డుల నుంచి తొలగింపు
న్యూఢిల్లీ, జూన్ 25: లోక్‌సభలో సభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా మంగళవారం కాసేపు గందరగోళం నెలకొన్నది. హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత ‘జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా, అల్లాహు అక్బర్’ అని నినదించారు. దీంతో అధికార ఎన్డీయే సభ్యులు ఒక్కసారిగా లేచి నిలబడి నిరసన తెలిపారు. జై పాలస్తీనా అని సభలో ఎలా అంటారని నిలదీశారు. దీంతో జై పాలస్తీనా అనే పదాన్ని రికార్డుల నుంచి తొలగిస్తానని ప్రొటెం స్పీకర్ మహాపాత్ర ప్రకటించటంతో వివాదం సద్దుమణిగింది.
అనంతరం కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశంపై స్పందించారు. భారత్‌లో నివసిస్తూ ఏనాడూ భారత్ మాతాకీ జై అని పలుకని ఒవైసీ.. నేడు జై పాలస్తీనా అనటం సభా నిబంధనలకు విరుద్ధమని విమర్శించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రెజిజు స్పందిస్తూ.. పాలస్తీనాకు భారత్ వ్యతిరేకం కాదని, కానీ సభలో అలా మాట్లాడటం రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఒవైసీ అసలు రూపం బహిర్గతమైందని మండిపడ్డారు. అయితే, ఒవైసీ తన వ్యాఖ్యలను సమర్ధించుకొన్నారు. తాను ఎక్కడా సభా నియమాలను ఉల్లంఘించలేదని స్పష్టంచేశారు.
జై హిందూ రాష్ట్ర వివాదం
ఒవైసీ వివాదం సద్దుమణిగిన కొద్దిసేపటికే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎంపీ ‘జై హిందూ రాష్ట్ర, జై భారత్’ అని నినాదం చేసి కొత్త వివాదానికి తెరలేపాడు. జై హిందూ రాష్ట్ర నినాదం ఇవ్వటంపై సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మాట రాజ్యాంగ విలువలకు వ్యతిరేకమని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని ఎంపీగా ప్రమాణం చేశారు. చివరలో ఆయన జై హింద్, జై సంవిధాన్ అని నినాదమిచ్చారు.






