జై భారత్ అనేందుకు సిగ్గా?
ఒవైసీ జై పాలస్తీనా నినాదంపై రాజాసింగ్ ఆగ్రహం
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): ఎంపీగా ప్రమాణస్వీకారం సందర్భంగా జై పాలస్తీనా అంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన నినాదంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. పాలస్తీనాపై అంత ప్రేమ ఉంటే భారత్ విడిచి ఆ దేశానికి వెళ్లి తుపాకీ పట్టుకోవాలని సూచించారు. ఒక్కసారి పాలస్తీనా వెళ్తే మీలాంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం అవుతుందన్నారు. ఈ దేశంలో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేస్తూ భారత్ మాతాకీ జై, జై భారత్ నినాదాలు చేయడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని ఒవైసీని నిలదీశారు.
లోక్‌సభలో ప్రమాణస్వీకారం విధివిధానాలు తెలియకుండా ఉండేందుకు ఒవైసీ ఏమీ కొత్తగా ఎన్నికైన సభ్యుడు కాదని రాజాసింగ్ మండిపడ్డారు. మీ స్థానంలో వేరే సభ్యుడెవరైనా జై ఇజ్రాయిల్ అంటే ఊరుకునేవారా? రాద్ధాంతం చేసేవారంటూ నిలదీశారు. మీడియాలో హైలైట్ అయ్యేందుకు ఈ తరహా వ్యాఖ్యలు సరికాదని హితవు పలికారు. తాము కుడా జై భీం అంటామని, కానీ జై పాలస్తీనా అని ఒవైసీ అనడం ఆలోచించాల్సిన విషయమని పేర్కొన్నారు.






