6 March, 2026 | 11:10 PM

పెంబి మండలంలో ఆస్పిరేషన్ పకడ్బందీగా అమలు చేయాలి

23-12-2025 12:31 AM

నితియోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రత్యేక అధికారి శిల్పా రావు

నిర్మల్,(విజయక్రాంతి): పెంబి మండలంలో నితియోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయాలని నితియోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ ప్రత్యేక అధికారి శిల్పా రావు అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమ అమలు తీరుపై ఆమె జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్య, వైద్యం, బ్యాంకింగ్, పోస్టల్ సేవలు, పోషకాహారం, త్రాగునీరు, ఇతర మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. వివిధ శాఖల అధికారులు పెంబి మండలంలో అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, నితియోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కార్యక్రమాన్ని పెంబి బ్లాక్‌లో విజయవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించడం గర్వకారణమన్నారు. ప్రజల భాగస్వామ్యం, అధికారుల అంకితభావంతో ఈ కార్యక్రమం పెంబిలో విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. అన్ని విభాగాల్లో పెంబి బ్లాక్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

సమీక్షా సమావేశానికి ముందు కలెక్టరేట్‌కు వచ్చిన ప్రత్యేక అధికారికి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్‌లు కలెక్టర్ ఛాంబర్‌లో పూల మొక్కను అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రాజేందర్, వ్యవసాయ శాఖ అధికారి అంజిప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారి అంబాజీ, డీఆర్డీవో విజయలక్ష్మి, జెడ్పీ సీఈవో శంకర్, పశువైద్య శాఖ అధికారి బాలిక్ అహ్మద్, ఎల్డీఎం రామ్ గోపాల్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.