16 April, 2026 | 2:14 PM

రవాణా అధికారిపై దాడి

28-06-2024 01:37 AM

జేటీసీ రమేశ్‌పై దాడి చేసిన యూనియన్ నేత 

నేడు రవాణా శాఖ ఉద్యోగుల పెన్ డౌన్ 

దాడిని ఖండించిన రవాణా శాఖ మంత్రి పొన్నం 

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27(విజయక్రాంతి) : రవాణా శాఖ హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (జేటీసీ) సీ రమేష్‌పై దాడి జరిగింది. ఆటో యూనియన్ నాయకుడు అమానుల్లా ఖాన్ జేటీసీ రమేష్‌పై దాడి చేశాడు. గురువారం మధ్యా హ్నం జేటీసీ కార్యాలయానికి వచ్చిన అమానుల్లా ఖాన్.. ఆటోలకు మీటర్ల ఏర్పాటుతో పాటు పలు అంశాలపై జేటీసీ రమేష్‌తో చర్చించారు. ఈ క్రమంలోనే జేటీసీ రమేష్‌పై దాడి చేశాడు. ఊహించని పరిణామంతో అక్కడున్న ఉద్యోగులంతా అవాక్క య్యారు. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది అమానుల్లా ఖాన్‌ను పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు.

దాడి విషయం తెలుసు కున్న రవాణా శాఖ ఉద్యోగులు, సంఘాల నాయకులు పెద్దఎత్తున ఖైరతాబాద్ కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, యూనియన్ నాయకులు అధికారులపై భౌతిక దాడులకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. ఇదే అమానుల్లా ఖాన్ గతంలో మాణిక్ ప్రభు అనే అధికారిపై కూడా దాడి చేశాడని గుర్తుచేశారు. క్రిమినల్ చరిత్ర కలిగిన అమానుల్లా ఖాన్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేటీసీ రమేష్‌పై దాడి కి నిరసనగా శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా ఉద్యోగుల సంఘం నాయకులు రవీంద్ర కుమార్, చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, రామకృష్ణ, అరుణేంద్ర ప్రసాద్, ఎంజులారెడ్డి పాల్గొన్నారు. 

దాడిని ఖండించిన మంత్రి పొన్నం

జేటీసీ రమేష్‌పై జరిగిన దాడిని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. అధికారులపై దాడులు చేసే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏమైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాలి తప్ప దాడులు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో రవాణా శాఖ ఉద్యోగులకు అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎట్టి పరిస్థితిలో అధైర్య పడవద్దన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసకుంటామన్నారు.