పంచాయతీకీ అసెంబ్లీ జాబితానే!
పాత ఓటరు జాబితాతోనే స్థానిక ఎన్నికలు
6వ తేదీన ఓటర్ల ముసాయిదా విడుదల
13వ తేదీవరకు అభ్యంతరాల స్వీకరణ
9న జిల్లా, 10న మండల స్థాయిలో భేటీలు
21న వార్డులవారీగా తుది జాబితా
రాజకీయ పార్టీలతో ఎన్నికల కమిషనర్ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 31(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఎటువంటి మార్పు లేకుండానే గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను వార్డుల వారీగా ఎన్నికల సంఘం తయారు చేయనుంది. ఈ నెల 6వ తేదీన ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో శనివారం రాష్ర్ట ఎన్నికల సంఘం కమిషనర్ పార్థ సారధి అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమైంది.
వార్డుల వారీగా గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా తయారీ కోసం పార్టీల నుంచి సలహాలు, సూచనలు కోరారు. ఆర్టికల్ 243(కే) ద్వారా రాష్ర్ట ఎన్నికల కమిషన్‌కు ఉన్న అధికారాలను కమిషనర్ వివరించారు. ఓటర్ల జాబితా ప్రచురణకు సంబంధించిన సూచనలు, సలహాలను తీసుకునేందుకు ఈ నెల 9వ తేదీన జిల్లా స్థాయిలో, 10వ తేదీన మండలస్థాయిలో రాజకీయ ప్రతినిధులతో ఎన్నికల సంఘం సమావేశాలను నిర్వహించనుంది. అసెంబ్లీ ఓటర్ల అనుబంధ జాబితా రాష్ర్ట ఎన్నికల అధికారి వెబ్-సైట్‌లో ఉందని, వాటిని పరిశీలించి, అందులో పేరు లేని అర్హత కలిగిన ఓటర్లు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. మార్పులు, తొలగింపుల కోసం ఫారం -8, ఫారం- 7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
రాజకీయ నాయకుల సూచనలు
- రిజర్వేషన్ల అంశం గురించి నాయకులు ప్రస్తావించగా.. ఆ అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నదని కమిషనర్ సమాధానమిచ్చారు.
- ఓటర్ల జాబితాను గ్రామ పంచాయతీలోని వార్డులుగా విభజించేటప్పుడు ఒకే కుటుంబంలోని వ్యక్తులు ఒకే వార్డులో ఉండేట్లు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
- పోలింగ్ స్టేషన్లు కిలోమీటర్ పరిధిలోనే ఉండేలా చూడాలని ఆయా పార్టీల నాయకులు సూచించారు.
- కీలక నిర్ణయాలివే..
- ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఓటర్ల జాబితాపై ఎన్నికల సంఘం అభ్యంతరాలను స్వీకరించనుంది.
- 19వ తేదీ నాటికి జిల్లా పంచాయతీ అధికారి ఆ అభ్యంతరాలను పరిష్కరించి 21న తుది జాబితాను వార్డులవారీగా ప్రకటిస్తారు.
- పంచాయతీ ఓటర్ల జాబితాలోని అభ్యంతరాలను.. అనగా ఒక ఓటరు ఒక వార్డు నుంచి ఇంకొక వార్డులో లేదా ఒక గ్రామ పంచాయతీ నుంచి వేరొక పంచాయతీలో తప్పుగా నమోదు అయినా లేదా నమోదులో తప్పులుగా ఉన్న వాటిని అసెంబ్లీ జాబితా ఆధారంగానే పరిష్కరిస్తారు.
- ఓటర్ల జాబితాలో కొత్తగా పేర్లు నమోదు, తొలగింపు, సవరణ అధికారాలు జిల్లా పంచాయతీ అధికారికి ఉండవు.
- ఏదైనా అసెంబ్లీ ఓటర్ల జాబితాలో కొత్తగా చేసిన నమోదులు, తొలగింపులు సవరణలను జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేస్తారు.






