27 August, 2026 | 2:47 AM

ఫిట్‌నెస్ లేని లెన్‌మెన్‌లు!?

27-08-2026 12:21 AM
  1. స్తంభాలు ఎక్కలేక అసిస్టెంట్ల ఏర్పాటు
  2. ప్రమాదవశాత్తు మరణిస్తే పట్టించుకోని అధికారులు
  3. అవగాహన లేక షాక్‌తో మరణిస్తున్న నిరుద్యోగులు
  4. మృతుని బంధువులతో భేరసారాలతో మమ అనిపిస్తున్న అధికారులు
  5. ఇలాంటి కేసులు వెలుగులోకి వస్తున్నా పట్టించుకోని యాజమాన్యం

మేడ్చల్  అర్బన్, ఆగస్టు 2౬ (విజయక్రాంతి): విద్యుత్ విభాగంలో పనిచేసే వారు ప్రతి క్షణం ప్రమాదపు అంచులపై ప్ర యాణం చేస్తుంటారు. అందుకే విద్యుత్ ఉద్యోగుల వేతనాలు ఏ ప్రభుత్వ ఉద్యోగికి లేనంతంగా చెల్లిస్తున్నారు.ఒక్కొక్క సీనియర్ లైన్మెన్,లైన్ ఇన్స్పెక్టర్ల వేతనాలే నెలకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షలకు పైగా ఉండడం గమనార్హం.అంత పెద్ద ఎ త్తున వేతనాలు తీసుకుంటున్న సదరు ఉద్యోగులు క్షణంలో ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధంగా ఉండాలి.

అవసరమైతే అర్ధరాత్రి విద్యుత్ స్తంభంపై ఎక్కి విద్యుత్ మరమ్మతు పనులు చేసి వినియోగదారులకు విద్యుత్ సరఫరాను పునరుద్దరించాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం విద్యుత్ విభాగంలో ప నిచేస్తున్న లైన్ ఇన్స్పెక్టర్లలో 80శాతం మంది,లైన్మెన్ లలో 50 శాతం మంది విధులు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నా యి.

ఫిట్నెస్ లేక విద్యుత్ స్తంభం ఎక్కలేని, దిగలేని పరిస్థితు ల్లో వారికి మరో ప్రైవేట్ అసిస్టెంట్లను ఏర్పాటు చేసుకుంటు న్న తీరు చర్చనీయాంశంగా మారుతుంది.అనుభవం లేని ని రుద్యోగ యువత ఆశతో వచ్చి కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.అంతేకాకుండా వారికి ఇటు సంస్థనుంచి కానీ,ఎటు వంటి వారిని ఏర్పాటు.చేసుకున్న లైన్మెన లై న్ ఇన్స్పెక్టర్ల నుంచి ఎలాంటి సహకారం లేక వారికి కుటుంబాలు రోడ్డున పడుతున్న తీరు బాధాకరం.

 లైన్మెన్,లైన్ ఇన్స్పెక్టర్లు స్వయంగా స్తంభాలను ఎక్కి దిగలేకపోతున్నారు. వృద్ధాప్యం కారణంగా కొంతమంది ఎక్కిదిగలేకపోతుంటే.. రోజువారీ ప్రాక్టీస్ లేక మరికొంత మంది దూరంగా ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అమాయక నిరుద్యోగులను అసిస్టెంట్లుగా నియమించుకుని గుట్టుగా వారితో సంస్థ పనులు చేయిస్తున్నారు. ప్రమాదవశాత్తూ కార్మికుడు మృతి చెందితే.. తీరా తమకేమి సంబంధం లేదని చెప్పి తప్పించుకుంటున్నారు.

కండ్లకోయ నుంచి సాయిగీతాశ్రమం దారిలో విద్యుత్ శాఖ అధికారులు చెట్లకొమ్మలు కత్తిరించే సమయంలో నల్గొండ జిల్లా, నారాయణపూర్ మండలం చిల్లపురం గ్రామానికి చెందిన కొర్ర జగ్రాం(46) హై టెన్షన్ వైర్లు తగిలి కింద పడిపోయాడు. కండ్లకోయ సీఎంఆర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే జగ్రాం మృతి చెందాడని తమకు న్యాయం చేయాలని కోరుతూ మృతుడి కుటుంబ సభ్యులు, మృతదేహాన్ని తరలించకుండ ఆసుపత్రి వద్ద అడ్డుకున్నారు.

ఉన్నతాధికారులు, పోలీసులు చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా మేడ్చల్ సబ్ స్టేషన్, అత్వెల్లి సబ్ స్టేషన్, కిష్టాపూర్ సబ్ స్టేషన్ పరిధిలో తరచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొంత మంది అమాయకులు గాయాలపాలు కాగా మరికొంత మంది మృత్యువాతపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ ఇందుకు బాధ్యులైన ఎఈ, రెగ్యులర్ లైన్మెన్లపై ఇప్పటివరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కనీసం ఉన్నతాధికారుల పంచనామాలో వారి పేరు కూడా కనిపించడం లేదంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

నిజానికి ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే ఉద్యోగుల విధులతో పోలిస్తే..

విద్యుత్ సంస్థల్లో విధి నిర్వహణ కొంత ప్రమాదకరం. రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టే ఎక్కడ లేనంత జీతం ఇక్కడి రెగ్యులర్ ఉద్యోగులకు వస్తుంది. అంతేకాదు వేతనంతో కూడిన సెలవులతో పాటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో అన్లిమిటెడ్ వైద్యసేవలు పొందే అవకాశం, ఒకవేళ ప్రమాదవశాత్తూ విధి నిర్వహాణలో షాక్ కు గురై చనిపోయినా, అంగవైఖల్యం బారినపడినా డిస్కం వారికి పెద్దమొత్తంలో నష్టపరిహారం చెల్లిస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంస్థలో ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తుంది.

కానీ జేఎల్‌ఎంలకు అసిస్టెంట్లుగా, విలేజ్ హెల్పర్లుగా చెప్పుకుంటున్న వారికి ఎలాంటి బెన్ఫిట్స్ వర్తించవు. భవిష్యత్లో పర్మినెంట్ అవుతుందనే ఆశతో చాలా మంది నిరుద్యోగులు వీరి కింద అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అంగీకరిస్తున్నారు. ప్రాణాలను ఫణంగా పెట్టి పనిచేస్తున్నారు. ముఖ్యంగా మేడ్చల్ డివిజన్ల పరిధిలో పనిచేస్తున్న రెగ్యులర్ జేఎల్‌ఎంలు, లైన్ ఇన్స్పెక్టర్లు, ఆర్టిజన్లు, ఫోర్మెన్లు ఈ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.

ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ విభాగం సిబ్బంది పనితీరును పరిశీలించాల్సిన ఏఈ, ఏడీఈ, డీఈలు ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదనే విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. జూనియర్ లైన్మెను పోస్టింగ్ వచ్చిన కొత్తలో నెలవారి జీతం రూ.40వేల వరకు ఉంటుంది. సీనియార్టీని బట్టి రూ.1.50లక్షలు పైగా తీసుకుంటున్నారు. నిజానికి వీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వీరికి సెక్షన్ ఆఫీసులో పోల్ ఎక్కే విధానం లేకుండాపోయింది.

మీటర్ రీడింగ్, డిస్ కనెక్షన్ (డిలిస్ట్) సర్వీసులకే పరిమితం అవుతున్నారు. మెజార్టీ ఫోర్మెన్లకు కనీసం కటింగ్ బ్లేడ్ పట్టడం కూడా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వర్కులు పూర్తిగా ప్రైవేటు కాంట్రాక్టర్లకు రావడం లేదు. రోజువారీ ప్రాక్టీస్ లేకపోవడంతో మెజార్టీ జేఎల్‌ఎంలు పోల్స్ ఎక్కడం మానేశారు. అవసరానికి మించి వేతనాలు ఉండటం కూడా విధి నిర్వహణలో నిర్లక్ష్యం పెరగడానికి మరో కారణం. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు వ్యక్తులతో పనిచేయిస్తున్నారు.

సంస్థ ఉద్యోగులు చేయాల్సిన పనులకు రోజువారీ కూలీలతో చేయిస్తున్నారు. విద్యుత్ లైన్లు, సరఫరా వ్యవస్థపై వారికి సరైన అవగాహన లేక విద్యుత్ ప్రమాదానికి గురై మృత్యువాత పడుతున్నారు. ఎల్సీలు తీసుకున్నప్పటికీ ఇంట్లోని ఇన్వెర్టర్లు, జనరేటర్ల నుంచి లైన్కు రిటర్న్ కరెంట్ పాస్ అవుతోంది. ఈ విద్యుత్ ప్రమాదాలపై ఏడీఈ, డీఈ ఇచ్చే ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు ఎఫ్‌ఎఐఆర్ నమోదు చేయాల్సి వస్తోంది.

ప్రైవేటు కార్మికులతో పని చేయించినట్లు ధృవీకరిస్తే.. రెగ్యులర్ ఉద్యోగికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆ విషయాన్ని వారు దాచిపెట్టి మృతుల బంధువులతో బేరసారాలతో సరిపెడుతున్నారు. వీరంతా ఇతర ప్రాంతాల నుంచి పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువు కోసం వచ్చిన వారుకావడంతో చేసేది లేక వారు కూడా ఇచ్చింది తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. ఈ విషయం యాజమాన్యానికి తెలిసి కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.