విద్యారంగంపై తగ్గుతున్న విశ్వాసం
ఢిల్లీతో పాటు దేశంలోని అనేక విద్యా కేంద్రాలలో ఇటీవల వెలుగుచూసిన నిరసనలు, తీవ్ర గందరగోళ పరిస్థితులు కేవలం విద్యార్థుల తక్షణ అసంతృప్తిని మాత్రమే కాక, సమాజంలో అంతర్లీనంగా పెరుగుతున్న లోతైన వ్యవస్థాగత వైఫల్యాలను ఎత్తిచూపుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనలకు తోడు, కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమాలు ఈ ఉద్రిక్తతలను మరింతగా రాజకీయం చేశాయి.
నేటి భారతదేశపు యువతలో కనిపిస్తున్న అసంతృప్తి, అసహనం కేవలం క్రమశిక్షణా రాహిత్యం కాదు; అది త్వరితగతిన మార్పును కోరుకునే ఒక క్రియాశీల ప్రజాస్వామ్య సంకేతం. మన యువత శీఘ్ర అభివృద్ధిని, అవినీతి రహిత పారదర్శక వ్యవస్థలను ఆశిస్తోంది. అయితే, ఈ ఆక్రోశం సరైన రాజ్యాంగబద్ధమైన మార్గంలో ప్రయాణించకపోతే, అది ప్రజాస్వామ్య మూలస్తంభాలైన సంస్థల స్థిరత్వాన్నే దెబ్బతీస్తుంది.
మన దేశ విద్యావ్యవస్థ విష యంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను సరిగ్గా విశ్లేషించాలంటే ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్స్ రూసో ప్రతిపాదించిన ‘సామాజిక ఒప్పం దం’ సిద్ధాంతాన్ని మనం సరికొత్త కోణంలో పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది.
పౌరులు తమ వ్యక్తిగత స్వేచ్ఛలోని కొంత భాగాన్ని పరిత్యజించి, ఉమ్మడి క్షేమం కోసం నియమ నిబంధనలకు, రాజ్యాంగ నిర్మాణాలకు కట్టుబడి ఉండటమే ఈ ఒప్పందం మూలసూత్రం. అయితే, వ్యవస్థలు తమ విశ్వసనీయతను కోల్పోయినప్పుడు లేదా పౌరుల ఆకాంక్షలను ప్రతిబింబించడంలో విఫలమైనప్పుడు, ఆ ఒప్పందం దెబ్బతిని నాగరిక బంధాలు సడలిపోతాయి. ప్రస్తుతం మన విద్యారంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ బంధం బలహీనపడుతోందనడానికి స్పష్టమైన నిదర్శనం.
మన విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ పరిపాలనా యంత్రాంగాలు ఈ సామాజిక ఒప్పందానికి ప్రతిరూపాలు. వీటి పరిధిలో భాగస్వామ్యం వహించడమంటే నియమాలను పాటించడం మాత్రమే కాదు; సంభా షణలకు వేదికనివ్వడం, విమర్శను స్వీకరించడం, పారదర్శకతను ప్రదర్శించడం. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు తరగతి గదులను కేవలం పాఠ్యాంశాలు బోధించే వేదికలుగా కాకుండా, రాజ్యాంగ విలువలను, పౌర బాధ్యతలను నేర్పించే కేంద్రాలుగా మలచాలి.
అయితే, ప్రస్తుతం వ్యవస్థలపై నమ్మకం సడలిన వాతావరణంలో, విద్యార్థులు ఈ నిర్మాణాలను తమ ఆకాంక్షలకు శత్రువులుగా చూడటం మొదలుపె డితే, అది ప్రజాస్వామ్య భవిష్యత్తుకే తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ప్రశ్నించే హక్కును, విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, ఆ ప్రశ్నలు వ్యవ స్థాపక నిర్మాణాలను కూల్చివేసేంత వీధిపోరాటాలుగా మారకుండా కాపాడుకోవ డం కూడా అంతే ముఖ్యం.
పారదర్శకతను ఆశిస్తున్న యువత
నేటి భారతదేశపు యువతలో కనిపిస్తున్న అసంతృప్తి, అసహనం కేవలం క్రమశిక్షణా రాహిత్యం కాదు; అది త్వరితగతిన మార్పును కోరుకునే ఒక క్రియాశీల ప్రజాస్వామ్య సంకేతం. మన యువత శీఘ్ర అభివృద్ధిని, అవినీతి రహిత పాలన, పారదర్శక వ్యవస్థలను ఆశిస్తోంది. అయితే, ఈ ఆక్రోశం సరైన రాజ్యాంగబద్ధమైన మార్గంలో ప్రయాణించకపోతే, అది ప్రజాస్వామ్య మూలస్తంభాలైన సంస్థల స్థిరత్వాన్నే దెబ్బతీస్తుంది. మన వద్ద సమాచార హక్కు చట్టం, స్థానిక ఫిర్యాదుల పరిష్కార వేదికలు, ఎన్నికైన విద్యా మండళ్లు వంటి అనేక వ్యవస్థాగత మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మార్గాలు వేగంగా, సమర్థవంతంగా స్పందించనప్పుడే యువత వీధుల్లోకి రాక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
రాజకీయ లబ్ధి కోసం ఆరాటం
ప్రస్తుతం దేశంలో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలలో అత్యంత విచారకరమైన అంశం ఏమిటంటే అసలైన విద్యా, పరిపాలనా సంస్కరణలు పక్కకుపోయి, రాజకీయ లబ్ధి కోసం ఆరాటం తీవ్రమవ్వడం. సీజేపీ ఆందోళనలు, దానికి మద్దతుగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలను గమనిస్తే, విద్యార్థుల సమస్యల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత పెరిగినట్లు కనిపిస్తోంది. ప్రజా సమస్యలను పరిష్కరించడం కంటే, పరస్పర రాజకీయ ఆరోపణలు, మాటల తూటాలు, ప్రసంగాల సమరాలు ప్రధాన ఎజెండాగా మారిపోతున్నాయి. దీనివల్ల నిరుద్యోగం, పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విద్యా నాణ్యత వంటి అసలైన అంశాలపై జరగాల్సిన లోతైన చర్చ దెబ్బతింటోంది. అంతిమంగా, ఎటువంటి ఆచరణాత్మక పరిష్కారాలు లభించక విద్యార్థుల భవిష్యత్తు పణంగా మారుతోంది.
గాంధేయ స్ఫూర్తికి తూట్లు
మహాత్మాగాంధీ నడిపిన స్వాతంత్య్ర సంగ్రామం మనకు నేర్పిన అతిపెద్ద పాఠం సాధించాల్సిన లక్ష్యంతో పాటు, దానికి ఎంచుకునే మార్గం కూడా అంతే నైతికమైనదై ఉండాలి. ‘సత్యాగ్రహం’ అనేది కేవలం ఒక నిరసన విధానం కాదు; అది ప్రత్యర్థిలోని నైతికతను నిద్రలేపే ఒక అహింసాయుత సాధనం. ఇటీవల చూసిన విధ్వంసకర ఆందోళనలు, దానికి సమాధానంగా ప్రభుత్వం ప్రయోగించిన కఠిన బలప్రయోగాలు--- రెండు కూడా గాంధేయ స్ఫూర్తికి విరుద్ధమైనవే. బలప్రయోగం తాత్కాలికంగా ఆందోళనలను అణచివేయగలదేమో గానీ, విశ్వాసాన్ని పునరుద్ధరించలేదు.
నమ్మకం బలపడాలంటే..
నేటి యువత ముందున్న ప్రధాన సవాలు ఏమిటంటే, వ్యవస్థాగత కోపాన్ని దాటి ఆలోచించడం. వ్యవస్థలను బయటి నుంచి ధ్వంసం చేయడం వల్ల లభించేది తాత్కాలిక తృప్తి మాత్రమే; కానీ, ఆ వ్యవస్థలలో అంతర్భాగమై, వాటిని లోపలి నుంచే సంస్కరించుకోవడం నిజమైన ప్రజాస్వామ్య సాధికారతకు దారితీస్తుంది. ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, అణచివేత ధోరణిని వీడి, పౌరుల ఆందోళనలను గౌరవించి చర్చలకు తలుపులు తెరవాలి. అప్పుడే పౌరులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ‘సామాజిక ఒప్పందం’ పునరుజ్జీవనం పొంది, ప్రజాస్వామ్య వ్యవస్థలు బలపడతాయి.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863
వెంకగారి భూమయ్య






