దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో దాడి
- ఇంధన ట్యాంకర్‌ను ఢీకొన్న డ్రోన్
భారీస్థాయిలో ఎగిసిపడిన మంటలు
ఎమిరేట్స్ విమానాశ్రయం మూసివేత
అనేక విమానాల రద్దు, మరికొన్ని అల్ మక్తూమ్‌కు మళ్లింపు
అబూధాబీ, మార్చి 16: యూఎస్ ఇరాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలతో పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ దాడులు పెంచుతోంది. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఓ డ్రోన్ ఇంధన ట్యాంక్‌ను ఢీకొట్టడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానాశ్రయంలోని అన్ని విమానాలను తాత్కాలికంగా నిలిపివేసి, ఎయిర్‌పోర్టును మూసివేసినట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ అధికారులు వెల్లడించారు.
ప్రయాణికులు, ఎయిర్‌పోర్టు సిబ్బందికి సేఫ్టీ నోటీసు జారీ చేశారు. విమానాల స్టేటస్ తెలుసుకునేందుకు విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు. పలు విమానాలను దుబాయ్ ఎయిర్‌పోర్టు నుంచి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. ఇంధన ట్యాంక్‌కు అంటుకున్న మంటలను ఆర్పేందుకు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. సమీపంలో భద్రతా చర్యలు చేపట్టడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఈ మేరకు దుబాయ్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టింది. విమానాశ్రయ రోడ్డు, విమానాశ్రయ సొరంగాన్ని పోలీసులు మూసివేశారు. సమీపంలోని ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఇంధన ట్యాంక్‌పై దాడి నేపథ్యంలో ఈ ప్రాంతంలోని కీలకమైన ఇతర మౌలిక సదుపాయాల వద్ద భద్రత పెంచినట్లు అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున కొచ్చి నుంచి దుబాయ్ వెళ్లిన ఎమిరేట్స్ విమానం మళ్లీ తిరిగి కొచ్చికి చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అది బయల్దేరిన కొద్ది సేపటి తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్టు మూసివేసినట్లు సమాచారం అందడంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు తెలిపారు.




