22 June, 2026 | 2:20 AM

‘నానో’పై వెనుకడుగు!

22-06-2026 12:54 AM
  1. ద్రవరూప యూరియాపై రైతుల అనాసక్తి  
  2. అధిక ఖర్చు వస్తుందని అభ్యంతరం
  3. ఏఈఓలు అవగాహన కల్పిస్తున్నా కనిపించని ఫలితం
  4. కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ప్రభుత్వానికి సవాల్   

హైదరాబాద్, మే 21 ( విజయక్రాంతి: నానో యూరియాపై రైతులు ఆసక్తి చూప డం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదంటూ ద్రవరూప యూరియా వాడేందుకు వెనుకాడుతున్నారు. సంప్రదాయ ఎరువులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో కొత్త టెక్నాలజీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. యూరియా కొరతను అధిగమించేందుకు, రాష్ట్ర ప్రభుత్వం నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

రాష్ట్ర అవసరాలకు మేరకు కేంద్రప్రభుత్వం యూరియా సరఫరా చేయకపోవడంతో రైతులు ఇబ్బం దులు పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుని అమలుకు శ్రీకారం చుట్టింది. నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నా రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సంప్రదాయ యూరియా కంటే నానోకే ఖర్చు అధికంగా అవుతుందని రైతు లు చెబుతున్నారూ. వరి నాటు వేసినప్పటినుంచి రెండుసార్లు యూరియా వేయాల్సి వస్తుంది.

దీంతో ఎకరాకు రెండు బస్తాల యూరియా అవసరం పడుతుంది. ఒక బస్తాకు రూ.260 చొప్పున రెండు బస్తాలకు రూ. 520 అవుతుంది. నానో యూరియాకు లీటరుకు రూ. 500 వరకు ఖర్చు అవుతుంది. సంప్రదాయ యూరియా అయితే రైతే స్వయంగా చేలో చల్లుకుంటాడు. నానో యూరియా ద్రవరూపంలో ఉండటంతో స్ప్రేయర్ ద్వారా చల్లాల్సి ఉంటుంది. నానో యూరియా స్ప్రే చేసిన వ్యక్తికి ఎకరాకు  రూ. 1000 వరకు అదనంగా ఖర్చు వస్తుంది. దీ ని వల్ల పెట్టుబడి పెరిగిపోతుండటంతో రైతు లు నానో యూరియా అంటేనే వెనుకడుగు వేస్తున్నారు.  

పెరగనున్న సాగు విస్తీర్ణం

ఈ ఏడాది రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తు న్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 132 లక్షల ఎకరాలకు పైగా పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా యూరి యా అవసరం అధికమవుతోంది. ఈ నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ మార్గాల ను చూపించాల్సిన అవసరం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.

వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) రైతు వేదికల్లో, ప్రత్యేకంగా అవగాహన సదస్సులు, క్షేత్రస్థాయి ప్రదర్శన కార్యక్రమాల ద్వారా నానో యూరియా వినియోగ విధా నం, ప్రయోజనాలను  వివరిస్తున్నారు. పం టలకు అవసరమైన నత్రజని పోషకాలను సమర్థ వంతంగా అందించడంలో నానో యూరియా ఉపయోగ కరమని, తక్కువ పరిమాణంతో ఎక్కువ ప్రయోజనం పొందవ చ్చని రైతులకు వివరిస్తున్నారు. అయినా రైతులకు  మాత్రం నానో యూరియాపై పూర్తిగా నమ్మకం కలగడం లేదు.

10 లక్షల టన్నుల సరఫరాకే అంగీకారం

రాష్ట్ర అవసరాల మేరకు 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసి కేంద్రానికి నివేదించింది. కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకే కేంద్రం అంగీకరించింది. దానిని కూడా సకాలంలో అందించలేకపోయింది. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారం ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో మొత్తం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రావాల్సి ఉండగా, ఇప్పటివరకు 3 లక్షలు మెట్రిక్ టన్నులు మాత్రమే వచ్చింది.

ఏప్రిల్‌లో 1.53 లక్షలు, మే నెలలో లక్ష మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వచ్చింది. ఈ రెండు నెలల్లో 4 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా సగం  మాత్రమే అందుబాటులోకి వచ్చింది.ఈ నెలాఖరు నాటికి 4.80 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్  చేరుకోవడం కష్టసాధ్యంగా మారింది.