22 June, 2026 | 1:19 AM

ఆర్థిక చైతన్యం పేరిట స్వాహా!

22-06-2026 12:00 AM
  1. పర్యవేక్షణ లోపం మహిళా సంఘాలకు శాపం 
  2. సీసీలు, వివో ఏల చేతివాటం నిజాయితీగా చెల్లిస్తున్న మహిళల డబ్బులకు గాలం
  3. అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటా, డి ఆర్ డి ఎ పి డి, దామోదర్ రెడ్డి

కామారెడ్డి, జూన్ 21 (విజయక్రాంతి): మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒకవైపు ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టి మహిళలను ఆర్థిక స్వలంబన దిశగా అడుగులు వేస్తున్న, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బంది  ప్రభుత్వం నెలనెలా వేతనాలు చెల్లిస్తూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని కోరుకుంటుండగా కొంతమంది క్షేత్రస్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీంతో నిజాయితీగా చెల్లించే స్వయం సహాయక  మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు పర్యవేక్షణ లోపం కారణంగా కొంతమంది మహిళలు రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించడం లేదు.

నిరక్షరాశుల గ్రూప్ లే టార్గెట్

 ఇటీవల కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని ఓ గ్రామంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. సీసీ, వివో ఏ కుమ్మకై తమ సొంతానికి రుణాలకు సంబంధించిన డబ్బులను వాడుకున్నారు.  స్వయం సహాయక మహిళా సంఘాలు చెల్లించిన రుణాల సంబంధించిన చెల్లింపులలో సొంతానికి వాడుకొని మహిళల రుణాలను బ్యాంకుల్లో చెల్లించకుండా అప్పులను అప్పులు గానే మిగులుస్తున్నారు. ఈ విషయం స్థానిక బ్యాంకు మేనేజర్ దృష్టికి మహిళ సంఘాల సభ్యులు తీసుకెళ్లడంతో సిసి, వివో ఏ లను బ్యాంకు మేనేజర్ ప్రశ్నించడంతో సమాధానం చెప్పలేక మహిళా సంఘాల మహిళలను సముదాయించి తాము డబ్బులు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

గతంలో లక్షలు స్వాహా

 గతంలో తాడువాయి సిసి గా పనిచేసిన వ్యక్తితో పాటు బుక్ కీపర్ కుమ్మక్కై నంది వాడ మహిళా సంఘాలకు చెందిన 30 లక్షల రూపాయలు సీసీ కాజేశాడు. ఈ విషయంపై మహిళా సంఘాలు సభ్యులు సిసి ఇంటి ఎదుట ఆందోళన నిర్వహించారు.

అధికారులు చర్యలు తీసుకొని సిసిని విధుల నుంచి తొలగించారు తప్ప, తీసుకున్న డబ్బులు రికవరీ చేయలేకపోయారు. మరో సంఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం హసన్ పల్లి గ్రామంలో గతంలో 24 లక్షల రూపాయలు ఎస్బిఐ బ్యాంక్ మిత్ర, వివో, సీసీలు కలిసి డ్వాక్రా మహిళలను మోసగించి పేక్షక పాత్ర వహించిన అప్పటి ఏపిఎం రామ్ నారాయణ గౌడ్ ఇంతవరకు మహిళలకు చెందిన 24 లక్షల రూపాయలు మహిళల ఖాతాల్లో బ్యాంకులో ఇప్పటికీ జమ చేయలేదు. మహిళలు ఇప్పటికీ బ్యాంకుకు అప్పు ఉన్నారు. తప్పు చేసిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పలు చోట్ల వెలుగు చూసాయి. 

మొక్కుబడి ఆడిటింగ్ లే..

మహిళా సంఘాలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న లావాదేవీలపై ఆడిటింగ్ చేయిస్తున్నారు. లోతుగా పరిశీలించకుండానే వారికి మామూలు అప్పగించి తూ తూ మంత్రంగా ఆడిట్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. అక్రమాలు మాత్రం బయటకు రావడం లేదు. ఆడిటింగ్ చేసే వారికి డబ్బులు ఇవ్వాలని ఏపీఎం, సీసీలు మహిళా సంఘాలకు చెప్పి వారిని నుంచే డబ్బులు వసూలు చేసి ఆడిటింగ్కు వచ్చిన అధికారులకు మామూలు చెల్లిస్తున్నారు. ఆడిటింగ్ లో కూడా ఏపీఎంలు, సీసీలు కుమ్మక్కై ఎంతో కొంత ఆడిటింగ్ అధికారులకు మామూలు ముట్టజెప్పి ఆడిటింగ్ చేయించి మమ అని పిస్తున్నారు.

అక్రమాలపై విచారణ చేపడతా.. 

కామారెడ్డి జిల్లాలో మహిళా సంఘాల ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెట్టి మహిళలకు అప్పగిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల ను కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో ఆర్టీసీ బస్సులను, హోటలను, సూపర్ మార్కెట్లను, చిన్న చిన్న పరిశ్రమలను నెలకొల్పి వారికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించి వారిని ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా కార్యక్రమాలను చేపడుతున్నాం. మహిళా సంఘాల డబ్బులను స్వాహా చేసిన వారిని గుర్తించి వారి నుంచి డబ్బులు రికవరీ చేసేలా వారి ఆస్తులను జప్తు చేసి మహిళా సంఘాల కు జమ చేయిస్తా. ఎవరిని ఊపేక్షించేది లేదు. గతంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తా.

- దామోదర్ రెడ్డి, డీఆర్‌డీఓ, పీడీ, కామారెడ్డి