రఫాపై రచ్చ రచ్చ
ఐసీజే, అమెరికా చెప్పినా కొనసాగిన ఇజ్రాయెల్ దాడులు
పిల్లలు సహా 45 మంది అమాయకులు బలి
చివరికి తప్పు జరిగిందని అంగీకరించిన ఆ దేశ ప్రధాని
రఫాపై దాడిని ఖండించిన అమెరికా సహా పలు పాశ్చాత్య దేశాలు
ఆల్ ఐస్ ఆన్ రఫా అంటూ సెలబ్రిటీల మద్దతు
టెల్‌అవీవ్ (ఇజ్రాయెల్), మే 29: దక్షిణ గాజాలోని రఫా నగరంపై దాడిని ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. ఆదివారం రాత్రి చేసిన దాడిలో 45 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. ఇందులో మహిళలు, పిల్లలు అధికంగా ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటివరకు గాజాపై జరిగిన అత్యంత పాశవికమైన దాడుల్లో ఒకటిగా దీన్ని పేర్కొంటున్నారు. అందుకే ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయి తే, రఫాపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హమాస్ ఎదురుదాడి చేసింది.
ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. హమాస్ దాడిని తిప్పికొడుతూ.. ఇజ్రా యెల్ కూడా మంగళవారం వైమానిక దళం తో ప్రతిదాడి చేసింది. ఈ దాడిలో 37 మంది పాలస్తీనీయులు మరణించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అమెరికా సైతం ఆదివారం అర్ధరాత్రి జరిగిన దాడిని ఖండించింది. భారత్‌లోనూ ఈ దాడిని వ్యతిరేకించారు. రఫాకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థ హమాస్‌కు వ్యతిరేక దాడిలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
అమెరికా ఆగ్రహం..
రఫాపై ఇజ్రాయెల్ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. మహిళలు, పిల్లలు సహా పెద్ద ఎత్తున మరణాలు సంభవించడంపై తీవ్ర విచారం వ్యక్తంచేసింది. ఇజ్రాయెల్ దాడిలో పదుల సంఖ్యలో సామాన్య పౌరులు మరణించిన దృశ్యాలు చూస్తుంటే హృదయం తరుక్కుపోతోంది. చాలా భయానకంగా ఉన్నాయి. హమాస్‌పై ప్రతీకారం తీర్చుకునే హక్కు ఇజ్రాయెల్‌కు ఉంది. కానీ, అది సామాన్యులకు ముప్పు కాకూడదు. హమాస్ కీలక నేతలను లక్ష్యం గా చేసుకుని ఈ దాడి జరిగింది. అయితే పౌరుల ప్రాణాలు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే, హమాస్‌పై దాడిలో అమెరికా తన విధానంలో మార్పు ఉండదు. కానీ, హమాస్‌పై భూతల దాడులు అవసరం లేదని భావిస్తున్నాం అని అమెరికా జాతీయ భద్రతా మండలి సమన్వయకర్త జాన్ కిర్బీ వెల్లడించారు.
పాలస్తీనాను గుర్తిస్తున్నాం..
రఫాపై దాడితో యూరోపియన్ యూనియన్ (ఈయూ)తో ఇజ్రాయెల్ సంబం ధాలు మరింత క్షీణించాయి. కొన్ని యూరోప్ దేశాలు కీలక ప్రకటన చేశాయి. ఇప్పటికే 140 దేశాలు పాలస్తీనాను స్వతం త్ర దేశంగా గుర్తించగా.. తాజాగా స్పెయిన్, నార్వే, ఐర్లాండ్ కూడా ఈ జాబితాలో చేరాయి. పాలస్తీనీయన్లు, ఇజ్రాయెలీలకు శాంతి లభించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఐర్లాండ్ తన దేశ పార్లమెంట్‌పై పాలస్తీనా జెండా ఎగురవేసింది. ఈ నిర్ణయంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తప్పు చేశామన్న ఇజ్రాయెల్ ప్రధాని..
రఫాపై దాడి విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు విచారం వ్యక్తం చేశారు. తాము తప్పు చేసినట్లు పార్లమెంట్‌లో అంగీకరించారు. సామాన్య పౌరుల కు హాని చేయొద్దని ఎంతగానో ప్రయత్నించామని, కానీ ఈ విషాద ఘటన జరిగిందని బాధపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు. గతంలో రఫాలో తల్ అల్ సుల్తాన్ ప్రాంతాన్ని సురక్షిత ప్రదేశంగా ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఉత్తర, మధ్య గాజా నుంచి ప్రజలు అక్కడికి వచ్చి తలదాచుకుంటున్నారు. అలాంటి సురక్షిత ప్రాంతంపై ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేయడం సంచలనం సృష్టించింది. ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా హమాస్ టెల్‌అవీవ్‌పై రాకెట్లను రాకెట్లను ప్రయోగించింది. ఐదు నెలల తర్వా త టెల్‌అవీవ్‌పై దాడి జరగడం ఇదే తొలిసారి.
ఐసీజేలో ఎదురుదెబ్బ..
రఫాపై మారణహోమానికి ఇజ్రాయెల్ పాల్పడుతోందని దక్షిణాఫ్రికా చేసిన ఫిర్యాదుపై అంతర్జాతీయ న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పునిచ్చింది. రఫాపై తక్షణమే సైనిక చర్యను నిలిపివేయాలని ఆదేశించింది. గాజా కు సాయమందేలా ఈజిప్టు సరిహద్దును తెరవాలని నిర్దేశించింది. రఫా ప్రభుత్వానికి ఆటం కం కలిగించే చర్యలను చేపట్టొద్దని ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
ఆల్ ఐస్ ఆన్ రఫా..
రఫాలో శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ దాడి చేయడాన్ని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వ్యతిరేకిస్తున్నారు. భారత్‌లోని ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ మారణహోమంపై అవగాహన కల్పించేందుకు ఆల్ ఐస్ ఆన్ రఫా (అందరి కళ్లు రఫా పైనే) అనే నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా పదం ట్రెండ్ అవుతోంది. ఈ నినాదంతో ఉన్న ఇమేజ్‌ను పోస్ట్ చేస్తూ కాల్పుల విరమణకు అభ్యర్థిస్తున్నారు. సమంత, త్రిష, మాళవిక మోహన్, రష్మిక, దుల్కర్ సల్మాన్, పార్వతి, అమీ జాక్సన్, ఆలియా భట్, కరీనాకపూర్, ప్రియాంకచోప్రా, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపినిస్తూ ఉన్న ఒక పోస్టును సమంత షేర్ చేశారు. యునిసెఫ్ అంబాసిడర్‌గా ఉన్న ప్రియాంక పాలస్తీనా విషయంలో మౌనంగా ఉండటంపై విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కూడా రఫాకు మద్దతు ప్రకటించారు. చిన్నారులు ప్రేమ, రక్షణ, శాంతికి అర్హులని ఆలియా తన ఇన్‌స్టాలో పేర్కొంది.






