14 August, 2026 | 2:29 AM

సుఖ్‌బీర్‌సింగ్‌పై దాడి

14-08-2026 12:54 AM
  1. ఎస్‌ఏడీ అధ్యక్షుడికి గాయాలు
  2. నిందితుడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది
  3. నాందేడ్ గురుద్వారా వద్ద ఘటన
  4. ప్రధాని మోదీ, సీఎం ఫడ్నవీస్ ఆరా

ముంబై, ఆగస్టు 13: ఎస్‌ఏడీ (శిరోమణి అకాలీ దళ్) అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై దాడి జరిగింది. గురువారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో మాతా సాహిబ్ కౌర్ గురుద్వారాలోని ‘తఖ్త్ శ్రీ హజూర్ సాహిబ్’లో కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వెళ్లారు. ఈ సమయంలో జస్పాల్ తేజ్‌పాల్ సింగ్(62) అనే పూణెకు చెందిన న్యాయవాది సుఖ్‌బీర్‌పై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. దీంతో బాదల్ చేతికి గాయమైంది.

భద్రతా సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిలోనూ ఒకరికి గాయాలయ్యాయి. నిందితుడిని పట్టుకున్న భద్రతా సిబ్బంది అతన్ని పోలీసులకు అప్పగించారు. సుఖ్‌బీర్ సింగ్‌ను దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. దాడి జరిగినప్పుడు ఆయన సతీమణి, ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ కూడా ఆయన వెంటనే ఉన్నారు. దాడి ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంపీ హర్‌సిమ్రత్ కౌర్‌తో ఫోన్‌లో మాట్లాడి సుఖ్‌బీర్ ఆరోగ్యంపై ఆరా తీశారు.

ఈ దాడిపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నాందేడ్ ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, ఆసుపత్రి వద్ద భద్రతను పెంచాలని, నిందితుడి వివరాలు ఆరా తీయాలని ఆదేశిస్తూ దాడిని తీవ్రంగా ఖండించారు.

జస్పాల్ తేజ్‌పాల్ సింగ్ గత రెండేళ్లుగా అదే గురుద్వారాలో పనిచేస్తున్నాడని, దాడి ఎందుకు చేశాడన్నది తెలియదని, విచారణలో తేలుతుందని పోలీసులు తెలిపారు. ఈ దాడి ఘటనను ఎస్‌ఏడీ పార్టీతోపాటు పలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. 2024లోనూ అమృత్‌సర్ స్వర్ణదేవాలయం బయట ఓ వ్యక్తి సుఖ్‌బీర్‌పై కాల్పులకు తెగబడ్డాడు. ఈ దాడిలో బాదల్ తృటిలో తప్పించుకున్నారు.