04-10-2025 02:12:58 AM
అట్టావా, అక్టోబర్ 3: కెనడాలో భారతీయ చిత్రాలకు వ్యతిరేకంగా దాడులు జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. దక్షిణాసియాకు చెందిన సినిమాలను ప్రదర్శిస్తున్న కారణంగా ఓ సినిమా థియేటర్‌పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలతో అప్రమత్తమైన యాజమాన్యం, భారతీయ సినిమాల ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఆ సినిమాల్లో ‘కాంతార చాప్టర్ ౧’,‘ఓజీ’ కూడా ఉండడంతో వాటిని కూడా ప్రదర్శించడంలేదని యాజమాన్యం తెలిపింది. ఒంటారియోలోని ఓక్విల్ నగరంలో ఉన్న ’ఫిల్మ్.కా సినిమాస్’ అనే థియేటర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు సెప్టెంబర్ ౨౫న మొదటిసారి దాడి జరిగింది. సెప్టెంబర్ 25న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు థియేటర్ ప్రవేశ ద్వారానికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. సీసీటీవీ ఫుటేజీ ప్రకారం, వారు ఎర్రటి గ్యాస్ డబ్బాలతో వచ్చి, మండే ద్రవాన్ని పోసి నిప్పంటించారు. అయితే, ఆ సమయంలో థియేటర్ మూసి ఉండటంతో ఎవరికీ ఎ లాంటి గాయాలు కాలేదు.
ఈ దాడుల వెనక ఖలిస్థానీ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు థియేటర్ యాజమాన్యం అనుమానిస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని నిర్ధారించలేదు. కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవారులు వాంకోవర్‌లోని భారత్ కాన్సులేట్‌ను సీజ్ చేస్తామంటూ ఇటీవల బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఈ థియేటర్ దాడుల వెనక కూడా వారి హస్తం ఉండి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.