ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జాకు యత్నం
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..
- మెదక్ ఎంపీ రఘునందన్ రావు
- కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి
పటాన్చెరు, ఏప్రిల్ 9 : పటాన్చెరు పట్టణం నడిబొడ్డున ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కుట్ర జరుగుతోందని, దాంట్లో భాగంగానే పాఠశాల భవనాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. గురువారం బీజేపీ నాయకులతో కలిసి పటాన్చెరు శ్రీనగర్ కాలనీలో కూల్చివేతకు గురైన భవనాన్ని ఆయన పరిశీలించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేసి కలెక్టర్కు, డీసీపీకి ఫిర్యాదు చేసే వరకు కూల్చివేతలు కొనసాగాయని తెలిపారు.
అధికారుల తీరుపై ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో జరిగిన భూమి కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఎవరికి నచ్చిన రీతిలో వారు ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పాఠశాల భూములను ఆక్రమించడం జరుగుతోందని విమర్శించారు. భారతదేశంలో అమల్లో ఉన్న చట్టాలకు పటాన్చెరు నియోజకవర్గంలో సంబంధమే లేనట్టుగా అధికారంలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. పాఠశాల కూల్చివేతపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
1962కు పూర్వం నుంచే పాఠశాల కొనసాగుతోందని, భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు, ప్రొసీడింగ్స్, సర్వే నివేదికలు అందుబాటులో ఉన్నప్పటికీ అధికారులు కబ్జాదారులకు అనుకూలంగా వ్యవహరించడం దురదృష్టకరమని విమర్శించారు. జాతీయ రహదారి విస్తరణకు ఈ పాఠశాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇది కేవలం భూమి కబ్జా యత్నమేనని, వెంటనే సమగ్ర విచారణ జరిపి దోషులను శిక్షించాలని, లేనిపక్షంలో స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.




