10 April, 2026 | 1:56 AM

మహిళలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం

10-04-2026 12:00 AM

టీజీఐఐసి చైర్మెన్ నిర్మల జగ్గారెడ్డి

సంగారెడ్డి, ఏప్రిల్ 9(విజయక్రాంతి): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలో బేటి బచావో  బేటి పడావో పథకం కింద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50 మంది లబ్ధిదారులకు కుట్టు యంత్రాలను పంపిణీ చేయగా, మరో 25 మంది లబ్ధిదారులకు బ్యూటీషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించారు.

మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వహించబడింది. ప్రత్యేకంగా ఆర్థికంగా వెనుకబడిన మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులు, చదువు మధ్యలో మానేసిన వారు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా బాలసదనంలో  టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా మొక్కల నాటకం కూడా నిర్వహించారు.   

టీజీఐసీసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ బేటి బచావో  బేటి పడావో పథకం ద్వారా కుట్టు యంత్రాల పంపిణీ మరియు బ్యూటీషియన్ శిక్షణల ద్వారా మహిళల జీవనోపాధి మెరుగుపడుతుందని తెలిపారు. 

సంగారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనితా సంతోష్,  జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త పల్లవి, సీడీపీఓ చంద్రకళ, డీసీపీవో రత్నం, చిల్డ్రన్ సూపరింటెండెంట్ విజయ, కౌన్సిలర్లు రమేష్, అశ్విన్, నాయకులు శాంతి కుమార్ పాల్గొన్నారు.