12-11-2025 12:00:00 AM
ఓ నేత ఒత్తిడితో వెనుదిరిగిన అధికారులు
మునిపల్లి, నవంబర్ 11 : సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట గ్రామ శివారులోని కొంత భూమి సింగూరు ప్రాజెక్టులో ముంపుకు గురైంది. మొన్నటి వరకు అందులో నీళ్లు ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల సింగూరు ప్రాజెక్టులో నీటిని తొలగిస్తుండడంతో ముంపు భూములు తేలాయి. ఇదే అదునుగా భావించి ఓ భూ యజమానికి చెందిన ముంపుకు గురైన భూమిలో జేసీబీతో తవ్వకాలు జరుపుతున్నారు.
ఈ విషయాన్ని గ్రామ మాజీ సర్పంచ్ శివజ్యోతి, మాజీ ఉప సర్పంచ్ రాజు, కొంత మంది గ్రామస్తులు కబ్జాకు గురవుతున్న భూములను కాపాడాలని కోరుతూ సోమవారం మునిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు మంగళవారం ఆర్‌ఐ సుభాష్, గ్రామ పాలన అధికారి రాజు ఘటన స్థలానికి వెళ్ళి మట్టి తవ్వుతున్న జేసీబీని సీజ్ చేసి స్టేషన్ తరలించే క్రమంలో మల్లారెడ్డి పేట గ్రామ శివారులో రభస జరిగింది. వట్పల్లి మండలానికి చెందిన ఓ నేతకు సంబంధించిన జేసీబీనే ఆపుతారా..? అంటూ అధికారులపై చిందులు వేశారు.
దీంతో అధికారులు చేసేదేమి లేక పోలీసులకు సమాచారం అందించడంతో ఓ కానిస్టేబుల్ వచ్చి జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. దీంతో మునిపల్లి మండలానికి చెందిన ఓ రైతు సంఘం నేత వచ్చి ఏమైనా ఉంటే రేపు సర్వే చేయిద్దామని చెప్పడంతో రెవెన్యూ అధికారులు చేసేదేమీ లేక వెళ్లిపోయారు. సీజ్ చేసిన జేసీబీని తహసీల్దార్ కార్యాలయానికి లేదా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన అధికారులు మల్లారెడ్డిపేట గ్రామ పంచాయతీ కార్యాలయానికి తీసుకెళ్లడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.