12-11-2025 12:00:00 AM
అడ్డుకునేందకు వెళ్లిన ఫారెస్ట్ అధికారులపై గిరిజనుల దాడి
నాగర్‌కర్నూల్ జిల్లా ముక్కిడిగుండంలో ఘటన
కొల్లాపూర్, నవంబర్ 11: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామ సమీపంలోని వట్టిమాకులకుంట వద్ద సుమారు 15 ఎకరాల అటవీ భూమిని కొంతమంది గిరిజనులు అక్రమంగా నరికినట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అటవీ భూమిని నరికుతున్నారని సమాచారం అందడంతో అక్కడకు వెళ్లిన ఫారెస్ట్ అధికారి జయరాజును గిరిజనులంతా వెంటబడి దాడి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనలో జయరాజు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు అదనపు బలగాలతో అక్కడకు చేరుకుని దాడి చేసిన గిరిజనులలో కొందరిని అదుపులోకి తీసుకొని ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. మరికొందరు పరారైనట్లు ఫారెస్ట్ రేంజర్ ఈశ్వర్ తెలిపారు. అటవీ భూములను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అడవిని అక్రమంగా నరికేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ ఘటనపై కొల్లాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.