calender_icon.png 7 October, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీజేఐపై బూటుతో దాడికి యత్నం

07-10-2025 01:29:59 AM

  1. కోర్టులో వాదనలు జరుగుతుండగా న్యాయవాది దుశ్చర్య

అడ్డుకున్న భద్రతా సిబ్బంది

బెదిరింపులు తనను ప్రభావితం చేయలేవన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్

భారత్‌లో సనాతన ధర్మాన్ని కించపరుస్తే ఊరుకునేది లేదని ఆ న్యాయవాది  రాకేశ్ కిశోర్ కోర్టు హాలులో పెద్ద పెట్టున నినాదా లు చేశాడు. దాడి యత్నం ఘటనపై సీజేఐ గవాయ్ స్పందిస్తూ, ఇటువంటి బెదిరిం పులు తనను ప్రభావితం చేయవని.. వాద నలు కొనసాగించండని అన్నారు.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6(విజయక్రాంతి): కేసు విచారణ సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్‌పై బూటుతో దాడి చేసేందుకు ఓ న్యాయవాది యత్నించాడు. విచారణలో భాగంగా సోమవారం వాదనలు జరుగుతుండగానే సదరు న్యాయవాది ఈ దుశ్చర్యకు తెగబడ్డాడు. భారత్‌లో సనాతన ధర్మాన్ని కించపరిస్తే ఊరుకునేది లేదని పెద్ద పెట్టున నినాదాలు చేశాడు. గమనించిన భత్రతా సిబ్బంది వెంటనే అతడిని అడ్డుకున్నారు. ఊహించని పరిణామానికి అక్కడ ఉన్న వారంతా కలవరపాటుకు గురయ్యారు. 

సీజే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు

కాగా, కొద్దివారాల క్రితం మధ్యప్రదేశ్‌లో విష్ణుమూర్తి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై దాఖలైన పిటిషన్‌పై సీజే వాదనలు విన్నారు. అనంతరం పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఘటనకు సంబంధించి దేవుడినే ప్రశ్నించమని సీజే అన్నారు. ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.

మీరు విష్ణువు భక్తుడైతే.. ఆయనకే ప్రార్థనలు చేయండన్నారు. కాగా, సీజేఐ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనికి చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పందించారు. ‘తన వ్యాఖ్యలను తప్పుగా వక్రీకరించారని .. తాను అన్ని మతాలను గౌరవిస్తానని‘ తెలిపారు.

‘బెదిరింపులు నన్నేం ప్రభావితం చేయవు’

కోర్టులో జరిగిన దాడి యత్నం ఘటనపై సీజేఐ గవా య్ స్పందించారు. ‘ఇటువంటి బెదిరింపులు, దాడులు తనను ప్రభావితం చేయవు.. వాదనలు కొనసాగించండి‘ అని సీజే అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడిని వెంటనే విధుల నుంచి తప్పించారు. అనంతరం కోర్టు కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించారు.

ఘటనకు సంబం ధించి సెక్రటరీ జనరల్, సెక్యూరిటీ ఇన్‌చార్జ్, ఇతర అధికారులతో సీజే సమావేశం నిర్వహించారు. కాగా, బూటు విసిరిన లాయర్‌ను రాకేశ్ కిశోర్‌గా గుర్తించారు.  దాడి ఘటనకు సంబంధించి సీజేకు సదరు లాయర్ క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. తర్వాత కొంత సమయానికి న్యాయస్థానం ఆదేశాలతో లాయర్ రాకేశ్ కిశోర్‌ను ఢిల్లీ పోలీసులు విడుదల చేశారు.